పులివెందుల ఎఫెక్ట్‌తో క‌డ‌ప స్వ‌రూపం మారిపోతుందా..?

-

ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంపై వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు.. జ‌గ‌న్‌. ఇక్క‌డ చేసే అభివృద్ధితో జిల్లాపై త‌న‌దైన ముద్ర ప‌డేలా ఆయ‌న నిర్ణ‌యాలు క‌నిపిస్తున్నాయి. పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (పాడా) ఏర్పాటులో స‌మూలంగా పులివెందుల ముఖ‌చిత్రాన్ని మార్చివేయాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. గతంలో చేసిన శంకుస్థాపనలు, పనుల పురోగతి, బడ్జెట్‌ కేటాయింపులపై జ‌గ‌న్ దృష్టి పెట్టారు.  పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అవ‌స‌ర‌మైన నిధులను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేసేందుకు కూడా రెడీ అయ్యారు. కీల‌క‌మైన‌ ఎర్రబల్లి, గండికోట రిజర్వాయర్‌ నుంచి 40 రోజుల్లో పార్నపల్లి, పైడిపాలెం డ్యామ్‌లకు నీటి సరఫరా చేసే ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

అంతేకాదు, జీఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ స్కీమ్, అలవలపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ పనుల పురోగతిపైనా దృష్టి పెట్టారు. పులివెందుల బ్రాంచ్‌ కెనాల్, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్, గండికోట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌లపైనా జ‌గ‌న్ దృష్టి పెట్టి వాటిని రికార్డు స‌మ‌యంలో పూర్తి చేసేలా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో 10 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజి అమలు చేయడం కోసం రూ. 261.90 కోట్ల నిధులు విడుద‌ల చేసేందుకు ఓకే చెప్పారు. 154 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, మొగమేరు వంకపై ఫ్లడ్‌బ్యాంక్స్‌ మరియు చెక్‌డ్యామ్‌ల విష‌యాన్ని కూడా సీరియ‌స్‌గా తీసుకున్నారు.

ఇక‌, మ‌రో కీల‌క‌మైన విష‌యంగా పులివెందులలో ఆర్‌ అండ్‌ బి రోడ్ల నిర్మాణం, వేంపల్లి యుజిడి, సింహాద్రిపురం డ్రైనేజ్‌ సిస్టమ్, ముద్దనూరు–కొడికొండ చెక్‌పోస్ట్‌ రోడ్‌ పనులు, పులివెందుల మోడల్‌ టౌన్‌ ప్రపోజల్స్, న్యూ బస్‌ స్టేషన్, మినీ సెక్రటేరియట్, పులివెందుల మెడికల్‌ కాలేజి ఏర్పాటు, వేంపల్లిలో కొత్త డిగ్రీ కాలేజి, వేంపల్లి ఉర్దూ జూనియర్‌ కాలేజి, నాడు నేడు స్కూల్స్‌ పనులను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్తి చేసేలా జ‌గ‌న్ దూకుడు నిర్ణ‌యాలు తీసుకున్నారు.  పులివెందుల క్రికెట్‌ స్టేడియం, ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఏర్పాటుకు సంబంధించిన అంశాల‌పైనా దృష్టి సారించారు. ఇలా మొత్తంగా పులివెందుల‌ను పూర్తిగా ఆధునీక‌రించ‌డం  ద్వారా.. జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో క‌డ‌ప రూపాన్ని మారుస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version