భారత- చైనా సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో ఇరు దేశాల సైన్యాల మధ్య జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు అమరుడైన సంగతి అందరికి తెలిసిందే. అయితే అతని భార్య సంతోషికి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్‌లో సంతోషికి అందించారు.
సంతోషికి హైదరాబాద్, పరిపర ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని కూడా అధికారులను ఆదేశించారు. సంతోషికి సరైన శిక్షణ ఇప్పించి, ఉద్యోగంలో కుదరుకునే వరకు అండగా ఉండి సహకారం అందించాలని సీఎం తన కార్యదర్శి స్మితా సభర్వాల్‌ను కోరారు. సంతోషితో పాటు వచ్చిన 20 మంది కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇక సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇంతక ముందే సంతోష్ బాబు కుటుంబానికి 5కోట్ల రూపాయల ఆర్ధికసాయం మరియు హైదరాబాద్ లో ఇంటిస్థలం కేటాయించారు.