వైసీపీలో ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు.. అధినేత స్పందించేనా?

-

ఏపీలో ప్రజెంట్ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైసీపీ అధికారంలో ఉంది. అయితే, ఈ పార్టీలోనూ విభేదాలు ఉన్నాయని చర్చ కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. తాజాగా ఆ విభేదాలు బయటపడ్డాయి. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్యే రాజకీయం మహా రంజుగా సాగుతున్నదని, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ విభేదాలను ఇంకా పెంచుకుంటున్నారని తెలుస్తోంది. ఈ విభేదాలు ఇలానే కొనసాగితే నెక్స్ట్ టర్మ్ జగన్ పాలన ఉండటం కష్టమేనని, పార్టీలోనే అంతర్గత కొట్లాటలు మొదలవుతాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే, ఒంగోలు ఎంపీ మధ్య విభేదాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయమై జిల్లా వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్నది.

సర్వేపల్లిలో అక్రమ గ్రావెల్ తవ్వకాల విషయమై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులుపై ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని ఏ-2గా ఎంపీ మాగుంట పేరు చేర్చారు. కాగా, తనకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ మాగుంట ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వైసీపీ ఎమ్మెల్యే ప్రమేయంతోనే ఎంపీ శ్రీనివాసులుపై కేసు నమోదైందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. ఇకపోతే కేవలం ఒక్క జిల్లాలనే కాదు దాదాపు అన్ని జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. గుంటూరు డిస్ట్రిక్ట్ నరసరావు‌పేట ఎంపీ లావు కృష్ణదేవరాయలకు, చిలకలూరి‌పేట ఎమ్మెల్యే విడదల రజనీకి మధ్య అస్సలు పొసగడం లేదని తెలుస్తోంది. అనంతపురం ఎంపీ తరాలి రంగయ్య, కల్యాణ దుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌కు అస్సలు పడటం లేదని వైసీపీ వర్గాల ద్వారానే తెలుస్తోంది. ఇకపోతే ఈ విషయాలన్నిటిపై త్వరలో వైసీపీ అధినేత జగన్ దృష్టి సారిస్తారని, అన్ని సెట్ చేస్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version