గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. మరో నెలలో ఎన్నికలు జరగనుండగా.. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీతో పొత్తు కుదుర్చుకుంది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ గుజరాత్ లో మొత్తం 182 స్థానాల్లో మూడు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఈ రెండు పార్టీలు సంయుక్త ప్రకటన చేశాయి.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్ ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. ఎన్సీపీకి చెందిన కంధాల్ జడేజా ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే నిలిచారు. ఆయన పోర్‌బందర్ జిల్లాలోని కుటియానా అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఎన్‌సీపీతో కలిసి పోటీ చేయనున్నట్లు గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్ ఠాకూర్ తెలిపారు. ఉమ్రేత్ (ఆనంద్ జిల్లా), నరోడా (అహ్మదాబాద్), డియోగర్ (దహోద్ జిల్లా) స్థానాల్లో ఎన్‌సీపీ పోటీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 125 సీట్లు గెలుపొంది మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌కు ఎన్సీపీ మద్దతు ఇస్తుందని ఎన్సీపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జయంత్ పటేల్ బోస్కీ చెప్పారు.