కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై తెలంగాణ సిఎం కేసిఆర్ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర పార్టీని సైతం జాతీయ పార్టీగా మార్చి..జాతీయ రాజకీయాల్లో పోరాటం చేస్తున్నారు. అలాగే బిజేపికి వ్యతిరేకంగా విపక్ష పార్టీలని ఏకం చేయడానికి చూస్తున్నారు. ఇదే సమయంలో అప్పుడప్పుడు కేసిఆర్..కాంగ్రెస్ పార్టీకి మద్ధతుగా కూడా మాట్లాడుతున్నారు. జాతీయ స్థాయిలో ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్ధతు పలుకుతున్నారు.
కానీ రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీల మధ్య రాజకీయ వైరం నడుస్తూనే ఉంది. కాకపోతే కొందరు కాంగ్రెస్ నేతలు కేసిఆర్‌కు అనుకూలంగా ఉన్నారనే ప్రచారం వస్తుంది. ఇదే క్రమంలో తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీజేపీని ఎదుర్కునేందుకు అన్ని పార్టీలతో కలసి పనిచేస్తామని, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటును ఖండిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు తాజాగా ప్రెస్‌మీట్‌లు నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగా జానారెడ్డి కూడా మీడియాతో మాట్లాడారు. బీజేపీపై పోరుకు ఎన్నికలకు సంబంధం లేదని, బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు అనేది.. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని అన్నారు. అయితే పొత్తులపై జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని… వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకుటామని కాంగ్రెస్ నేతలు చెబుతూ వస్తున్నారు. పైగా వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉండదని, కాంగ్రెస్ ఒంటరిగానే బరిలో ఉంటుందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పదే పదే చెబుతూ వస్తున్నారు.
ఇలాంటి తరుణంలో జానారెడ్డి పొత్తులపై వ్యాఖ్యలు చేయడం కాస్త ఆసక్తికరంగా మారింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు ఎలాగో ముందు జరుగుతాయి..అప్పుడు పొత్తు లేకపోయినా తర్వాత జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కేసిఆర్, కాంగ్రెస్ తో కలిసి అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. విపక్ష పార్టీలు అన్నీ కలిసి బిజేపిపై ఫైట్ చేయవచ్చు.