విషాదంలో కాంగ్రెస్ …. విలాసంలో బీజేపీ ఎందుక‌ని?

-

ఐదారు దశాబ్దాలుగా దేశ రాజకీయాలను శాసించిన పార్టీ…స్వాతంత్య్రం తీసుకువచ్చిన పార్టీగా కూడా పేరు.. అయినా ఎందుకు త‌ట్టుకోలేని పరాజయాలు, చెప్పుకోలేని పరాభవాలు.ఇదీ సగటు కాంగ్రెస్ కార్యకర్తలను ఇవాళ్టి వేళ వేధిస్తున్న ప్రశ్న.

మరో జాతీయ పార్టీ బీజేపీ తనకు స్థానబలం లేని చోట్ల కూడా పాగా వేస్తోంది.స‌త్తా చాటుతోంది.స్థిర‌మ‌యిన ఫ‌లితాలు సాధించేందుకు త‌హ‌త‌హ‌లాడుతోంది.ఆ దిశ‌గా ప్ర‌య‌త్నించి స‌ఫ‌లీకృతం అవుతోంది కూడా ! ఇదే స‌మ‌యాన కాంగ్రెస్ మాత్రం కార్యకర్తలు..నాయకులున్న చోట కూడా పరాజయాలు మూటగ‌ట్టుకుంటోంది.తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితాలను చూస్తే.. బీజేపీ అనుకుంటున్న కాంగ్రెస్ ముక్త భారత్ ను చూసేలా కనిపిస్తోంది. ఎంతలా అంటే…తాము గెలిచే అవకాశం ఉన్న రాష్ట్రాల్లో కూడా ఓడిపోతుంటే అర్థం కానీ పరిస్థితి వారిది.ఇటీవల పంజాబ్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సిద్దూ అన్నట్లు.. కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ఓడిస్తుంది. ఈ వ్యాఖ్యలు చాలా చక్కగా సరిపోతాయి గ్రాండ్ ఓల్డ్ పార్టీకి.

దేశంలో ఎంతో కీలకం అయిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో… కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శక్తివంచన లేకుండా ప్రచారం చేసినా… ప్రజలు ఆదరించలేదు.ఇక్క‌డ 403 స్థానాలకు పోటీ చేస్తే కేవలం రెండంటే రెండు స్థానాల్లోనే గెలిచింది.తమకు కంచుకోటలుగా చెప్పుకునే అమేథీ, రాయ్ బరేలీలో కూడా కాంగ్రెస్ కోటలకు బీటలువారుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లో పోటీ చేస్తే 97 శాతం మంది కాంగ్రెస్ అభ్యర్థులు కనీసం డిపాజిట్లు దక్కించుకోలేక‌పోయారు. ఇక మరో కీలక రాష్ట్రం పంజాబ్ లో కాంగ్రెస్ ఓటమి స్వయంగా చేసుకున్నదే.

పీసీసీ చీఫ్ న‌వ‌జ్యోత్‌ సింగ్ సిద్దూ, సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ ల మధ్య వివాదం కాంగ్రెస్ ఓటమికి ఓ కారణంగా చెప్పవచ్చు.ఈ ద‌శ‌లో సీఎం పీఠంపై కన్నేసిన సిద్దూ.. చివరకు కాంగ్రెస్ అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి దిగ‌జారారు.అమరిందర్ తర్వాత సీఎం పగ్గాలు చేపట్టిన చరణ్ జీత్ సింగ్ చన్నీతో కూడా సిద్దూకు పొసగలేదు.పార్టీలో కుమ్ములాటలు చివరకు దారుణ పరాజయానికి కారణం అయ్యాయి.ఒకరికి ఒకరు సహకరించుకోకపోడంతో సీఎంతో సహా, పీసీపీ చీఫ్ కూడా సాధారణ ఆప్ నేతల చేతిలో ఓడిపోయారు.117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో కేవలం 18 స్థానాల్లో గెలుపొందింది.

ఉత్తరాఖండ్ లో బీజేపీ వ్యతిరేఖత ఉన్నా.. దాన్ని క్యాష్ చేసుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ.అక్కడ కూడా గతంలో కన్నా దారుణంగా ఓడిపోయింది.75 స్థానాల్లో కేవలం 19 స్థానాలను గెలుపొందింది.గోవాలో 40 స్థానాలకు 11 స్థానాల్లో, మణిపూర్ 60 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 5 స్థానాల్లో గెలుపొందింది.ప్రస్తుతం దేశంలో కేవలం రాజస్థాన్, ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది.

ప్రస్తుతం ఉన్న యువత, ప్రజలు కాంగ్రెస్ తీసుకువచ్చిన స్వాతంత్య్రం గురించి ఆలోచించడం లేదు.దేశంలో జాతీయవాదం, అభివృద్ధి కాంక్ష అన్న‌వి క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతున్నాయి.వీటిని అందిపుచ్చుకుని భవిష్యత్ పై అంచనాలు పెంచేలా కాంగ్రెస్ నాయకులు ఆలోచించాలి.ఇప్పటికే తమ పాత విధానాలు పాటిస్తూ..లౌకికవాదం ముసుగులో ఓట్లను ఆశిస్తే ఫలితాలు ఇదే విధంగా ఘోరాతిఘోరంగా ఉంటాయి.

ఈ త‌రుణాన కాంగ్రెస్ నాయ‌క‌త్వం గురించి చెప్ప‌న‌వస‌రమే లేదు.బీజేపీకి ఉన్న విధంగా మాస్ లీడర్లు కాంగ్రెస్ కు లేరు. బీజేపీలో మోదీని మొదలుకుని పలు రాష్ట్రాల్లో కూడా మాస్ లీడర్లు ఉన్నారు.అమిత్ షా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ వంటి మాస్ లీడర్లు చాలా చోట్ల ఉన్నారు.కానీ కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.పనిచేసేవారికి గుర్తింపు దక్కడం లేదు.దీంతో హ‌స్తం పార్టీని చాలా మంది వీడుతున్నారు.గతంలో మమతాబెనర్జీ, జగన్ మోహన్ రెడ్డి,జ్యోతిరాదిత్య సింథియా వంటి నేత‌ల‌ను వ‌దులుకుని కాంగ్రెస్ దిద్దుకోలేని త‌ప్పులే చేసింది. ప్రస్తుతం పార్టీకి అధ్యక్ష పదవికి అర్హుడయ్యే నేత‌ను ఎన్నుకోలేకపోతోంది.యువ రాజు రాహుల్ గాంధీ గతంలో కన్నా మెరుగైనా.. మోదీని ఢీకొనే సత్తా రాలేదు.ఇక సీనియర్ల.. జూనియర్లను ఎదగనీయడం లేదనే అపవాదు ఉంది.దీని కారణంగానే గతంలో మధ్యప్రదేశ్ నుంచి యువనేత జ్యోతిరాథిత్య సింథియా బీజేపీలో చేరారు.

రాజస్థాన్ లో కూడా మరో యువనేత సచిన్ పైలెట్ కూడా పార్టీ మారుతారనే వార్తలు వచ్చాయి.పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. మ‌రోవైపు బీజేపీకి మోడీ త‌ప్ప మరో ప్ర‌త్యామ్నాయ శ‌క్తి ఏదీ త‌ట‌స్థించ‌డం లేదు.ఆయ‌న వాగ్ధార కార‌ణంగా బాగానే నెగ్గుకుని వ‌స్తున్నారు.అవ‌సరం అయిన‌ప్పుడు భావోద్వేగ ప్ర‌ధాన రాజ‌కీయాలు (సెంటిమెంట్ ఓరియెంటెడ్ పాలిటిక్స్‌)ను బాగానే న‌డుపుతున్నారు. మోదీ తర్వాత కూడా రెండో తరం నాయకులు ఆ పార్టీ సార‌థ్య బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. అమిత్ షా కానీ, యోగి, హిమంతబిశ్వ శర్మ, నితిన్ గ‌డ్క‌రీ వంటి నేత‌లతో తమ అధి నాయకత్వాన్ని బలపరుచుకుంటూనే ఉంటోంది బీజేపీ.కానీ కాంగ్రెస్ మాత్రం ఇప్ప‌ట్లో కోలుకునేందుకు వీల్లేని స్థితిలో నైరాశ్యం నిండిన క‌ళ్ల‌తో ఆశ‌గా రేప‌టి వైపు చూస్తోంది. రోజులు మారితే కాంగ్రెస్ ఢోకా ఉండ‌దు.మార‌క పోతే బీజేపీకి తిరుగే ఉండ‌దు.ద‌టీజ్ పాలిటిక్స్.

Read more RELATED
Recommended to you

Exit mobile version