ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో… ధాన్యం కొనుగోలు అంశంపై చాలా గందరగోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు నేపథ్యంలోనే… ధాన్యం కొనుగోలు అంశంపై తీవ్ర సందిగ్దత నెలకొంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మౌనదీక్ష వేస్తోంది. ఇందిరా పార్క్ దగ్గర నేడు కాంగ్రెస్ పార్టీ మౌన దీక్షకు దిగింది. అయితే ఈ దీక్షలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
ఈ మౌన దీక్షకు తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి హాజరయ్యారు. అంతే కాదు.. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకరినొకరు అభివాదం చేసుకుంటూ… వేదికపై పక్క పక్కనే కూర్చున్నారు. రేవంత్ రెడ్డి పిసిసి అయిన తర్వాత పార్టీకి దూరంగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఇవాళ దీక్ష లో మాత్రం పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని వి హనుమంత రావు ఒప్పించి మరి ఈ దీక్ష కేంద్రానికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా సన్నిహితంగా మెలిగారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ దీక్షలో పాల్గొనడం గమనార్హం. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో విభేదాలు లేవని ఈ మౌన దీక్ష తో చెప్పే ప్రయత్నం చేశారు నేతలు.