కాంగ్రెస్ చాణక్యుడు..గాంధీ కుటుంబానికి ఆప్తుడు

-

కరోనా మహమ్మారి మరో దిగ్గజ నేతను బలి తీసుకుంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్‌ పటేల్‌ 71 ఏళ్ల వయసులో కరోనాతో చికిత్స పొందుతూ.. గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అహ్మద్ పటేల్‌గా పేరుపొందిన అహ్మద్‌భాయ్‌ మహ్మద్భాయ్‌ పటేల్‌.. 1949 ఆగస్టు 21న గుజరాత్‌లోని బరూచ్‌లో జన్మించారు. 1977 నుంచి 1989 వరకు లోక్‌సభ ఎంపీగా మూడు సార్లు.. 1993 నుంచి 2020 వరకు రాజ్యసభ్య సభ్యుడిగా ఐదు సార్లు ఆయన పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. మొత్తం ఎనిమిది సార్లు పార్లమెంట్‌ సభ్యుడిగా పని చేశారు. సోషల్ వర్కర్స్‌ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన.. విద్యార్ధిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

ఏఐసీసీ కోశాధికారిగా పనిచేస్తోన్న అహ్మద్ పటేల్‌ గాంధీ కుటుంబానికి అత్యంత ఆప్తుడు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో అత్యంత కీలక నేతగా గుర్తింపు పొందారు అహ్మద్ పటేల్. గత కొద్దిరోజులుగా మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో భాద పడుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. అహ్మద్ పటేల్‌కు నెల రోజులు క్రితం కరోనా సోకింది. . ఈ నెల 15 నుంచి ఆయన ట్విట్టర్‌ ఖాతాలో ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

సోనియా గాంధీ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుకా అహ్మద్ పటేల్ మాస్టర్ మైండ్ పనిచేస్తూ ఉంటుంది. ఒంటిచేత్తో కాంగ్రెస్ పార్టీని నడిపించిన వ్యక్తి. రాజకీయ ప్రత్యర్థి బలాబలాలను అంచనా వేసి…. కీలెరిగి వాత పెట్టడంలో మంచి దిట్టగా వ్యవహరిస్తారని పేరుంది. కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్‌గా దివంగత నేత ప్రణబ్ ముఖర్జీ ఉన్నా…. అంతే సమానంగా ట్రబుల్ షూటర్ అని పేరు సంపాదించుకున్నారు అహ్మద్ పటేల్.

అహ్మద్‌ పటేల్‌ స్వరాష్ట్రం గుజరాత్. రాజీవ్ గాంధీ హయాం నుంచి ఆయన కాంగ్రెస్‌తో ఉన్నారు. 1985లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో పటేల్ పార్లమెంటరీ కార్యదర్శిగా వ్యవహరించారు. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం నియమితమైన నర్మదా మేనేజ్ మెంట్ అథారిటీ ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించారు. సుదీర్ఘ కాలం సోనియా గాంధీకి రాజకీయ సలహాదారుగా వ్యవహరించారు. కాంగ్రెస్‌ పార్టీలో కీలక వ్యూహకర్తగా వ్యవహరించిన ఆయన పార్టీలోని అంతర్గత విభేదాలను పరిష్కరించడంలో దిట్టగా పేరుగాంచారు.

అహ్మద్‌ పటేల్‌ మరణంపై రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పటేల్‌ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ మరణం నన్ను తీవ్రంగా బాధించిందని ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు. చేదు మాటల్ని సైతం తీయని పదాలతో చెప్పే నేర్పరితనం ఆయనదంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆయన సేవల్ని కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటికీ మరవదని తెలిపారు. తాను సోదరున్ని కొల్పోయానంటు బాధని వ్యక్తం చేశారు సోనియా గాంధీ. పీవీ నరసింహా రావు, ప్రణబ్ ముఖర్జీ, చెన్నారెడ్డి, అర్జున్ సింగ్ లాంటి దురంధరులను హ్యాండిల్ చేయడంలో సోనియా గాంధీ తడబడ్డా ఆ తర్వాత అహ్మద్ పటేల్ సహాయంతో కాంగ్రెస్ పై తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు సోనియా. పార్టీ కీలక వ్యవహారాలలో సోనియా షాడో వ్యవహరించారు అహ్మద్ పటేల్.

Read more RELATED
Recommended to you

Exit mobile version