ఇటీవల ఏఐసీసీ రాహుల్ గాంధీ ఇచ్చిన రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ రైతు రచ్చబండ కార్యక్రమాని చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఊరురా కాంగ్రెస్ రైతుల సమస్యలను చర్చించి.. కాంగ్రెస్ డిక్లరేషన్ గురించి వివరించాల్సింది పోయి.. రైతు రచ్చబండ అంటూ.. రైతుల ముందే కాంగ్రెస్ నేతలు కొట్టుకున్న పరిస్థితి కామారెడ్డిలో వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే ఘర్షనకు దిగారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
లింగంపేట మండలం కోమట్‌పల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ కన్వీనర్ మదన్ మోహన్ రావు, ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఇంచార్జి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఇద్దరికి సంబంధించిన మద్దతుదారులు దాడులు చేసుకున్నారు. నడిరోడ్డుపై దాడులు చేసుకుంటూ స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురి చేశారు. అసభ్యకరమైన పదజాలంతో దూషించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.