అటు రాహూల్ గాంధీ ఇటు ప్రియాంక ఒకేసారి హుషారుగా ఎన్నికల రంగంలోకి దూకడం చూస్తుంటే కాంగ్రెస్ కి మంచిరోజులు వస్తున్నట్టే కనిపిస్తోంది. ఒక పక్క సోకాల్డ్ సీనియర్ల సణుగుడు, మరో పక్క బిజెపి దూకుడూ మధ్య అసలు కాంగ్రెస్ అడ్రస్ వుంటుందా అన్న అనుమానాలొస్తున్నాయి. ఈ సందేహాలకు సమాధానం చెప్పందుకు అన్నాచెల్లెళ్లు రెడీ అవుతున్నారు.
నిజానికి రాహూల్ కి సగటు రాజకీయ నాయకుడి లక్షణాలు ఎప్పుడూ లేవు. ముగ్గురు ప్రధానులని చూసిన కుటుంబం నుంచి వచ్చినా… అత్యంత సామాన్యుడిగా బతకడం అతని నైజం అయితే రాహూల్..ఎంత సాధారణ జీవితాన్ని ఇష్టపడతాడో.. అంత రిజర్వడ్ గాకూడా వుంటారు . అదే ఆయనకి రాజకీయాల్లోకొంత మైనస్ గా మారుతోంది. ఇప్పుడు ఆ రిజర్వ్డ్ నెస్ ని కొంత తగ్గించుకోవాలని డిసైడ్ అయినట్టే కనిపిస్తున్నారు. జనంలో కలిసిపోతున్నారు. సర్ వద్దు రాహూల్ చాలని పిలిపించుకుంటున్నారు.
అటు ఆయన సోదరి కూడా ఇదే దారిలో నడుస్తున్నారు. అంతఃపుర ఇనుపతెరలని బద్దలు కొట్టుకుని జనసామాన్యంలో చేయి చేయి కలుపుతున్నారు. జీవితకాలం అంతా కాంగ్రెస్ వల్ల లాభపడిన నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ తో లాభం లేదని డిసైడ్ అయినట్టు కనిపిస్తుంటే, ఈ ఇద్దరూ మళ్ళీ పార్టీకి కొత్త రక్తం ఎక్కంచాలని ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. సోనియా గాంధీ అనారోగ్యం..వరస పరాజయాలు నాయకత్వ బాధ్యతల పట్ల రాహూల్ నిర్లిప్తత ఇవన్నీ ఇంతకాలం పార్టీని పట్టిపీడిస్తున్న సమస్యలు.
రాహూల్,ప్రియాంక పర్యటనలతో వచ్చిన కొత్త జోష్ చూస్తుంటే.. ఆ సమస్యల నుంచి కాంగ్రెస్ పార్టీ బయటపడుతున్నట్టే కనిపిస్తోంది.