ఈ నెల 21న టీపీసీసీ తలపెట్టిన నల్లగొండ నిరుద్యోగ నిరసన దీక్షకు హాజరుకాలేనని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. అభివృద్ధి పనులపై కేంద్రంతో చర్చించేందుకు ఢిల్లీలో ఉన్నానని… అందుకే రాలేకపోతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇదే అంశంపై ప్రియాంక గాంధీ హాజరుకాబోయే సభను విజయవంతం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. నిరుద్యోగ దీక్షలు పార్టీ బలహీనంగా ఉన్నఅదిలాబాద్, కరీంనగర్‌లో నిర్వహిస్తే బాగుండేదన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. దీనిపై టీపీసీసీకి సలహా ఇస్తానని తెలిపారు. మరోవైపు ఈ కార్యక్రమంపై తనకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని నల్గొండ ఎంపీ, సీనియర్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
తన ఇలాకాలో జరిగే కార్యక్రమంపై ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంపై అసంతృప్తితో ఉన్నారు. పిలవని కార్యక్రమానికి ఎలా వెళ్తామని ప్రశ్నిస్తున్నారు.? అటు ఈ ఇష్యూపై ఇప్పటికే ఆయన హైకమాండ్ దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం. ఈ విషయమై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ థాక్రేకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో, టీపీసీసీ నిరసన సభను రద్దు చేసింది. వివాదం ముదిరే అవకాశం ఉందనో లేక అధిష్టానం ఆదేశించిందో గానీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సభను రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు.