శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తొక్కిసలాట ఘటనపై స్పందించారు. ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను తిరుపతి రుయా ఆస్పత్రిలో హోం మంత్రి అనిత గురువారం పరామర్శించారు.
శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఇటువంటి కష్టం కలగడం చాలా బాధాకరమని అన్నారు.తిరుపతి ఘటనలో కుట్ర కోణం ఉందా? అనే కోణంలోనూ పరిశీలిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చూస్తాం అన్నారు. బాధ్యతారహితంగా పని చేసినట్లు విచారణలో తేలితే కఠిన చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు.