ఆన్‌లైన్‌లో సహజంగానే మనకు అనేక ఈ-కామర్స్ సైట్లలో అప్పుడప్పుడు కొన్ని వస్తువులు చాలా తక్కువ ధరలకు లభిస్తుంటాయి. ఈ-కామర్స్ సైట్ల నిర్వాహకులు పలు సేల్స్ పేరిట మనకు కొన్ని వస్తువులను తక్కువ ధరలకు విక్రయిస్తుంటారు. అయితే అమెజాన్ సంస్థ సైట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ఇప్పుడు ఆ సంస్థ ఏకంగా రూ.40వేలను ఓ కస్టమర్ కు నష్టపరిహారంగా చెల్లించాల్సి వస్తోంది.
ఒడిశాకు చెందిన సుప్రియో రంజన్ మహాపాత్ర 2014లో అమెజాన్‌లో ల్యాప్‌టాప్‌లను కొనేందుకు యత్నించాడు. అందులో ఓ ల్యాప్‌టాప్ ధర రూ.23,309కు బదులుగా రూ.190 అని కనిపించింది. రూ.23,119 రాయితీ ఇచ్చినట్లు అందులో ఉంది. దీంతో తాన చాలా లక్కీ అని భావించిన అతను వెంటనే ల్యాప్‌టాప్‌ను ఆర్డర్ చేశాడు. అయితే సాంకేతిక సమస్య వల్ల ఆ ల్యాప్‌టాప్‌కు అలా ధర వచ్చిందని దాన్ని ఆమెజాన్ తరఫు నుంచి క్యాన్సిల్ చేశారు. దీంతో అతను ఇంకో ల్యాప్‌టాప్ కొన్నాడు.
అయినప్పటికీ అతను ఈ విషయాన్ని విడిచిపెట్టలేదు. వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. తాను రూ.190కి ల్యాప్‌టాప్ అని చూసి దాన్ని ఆర్డర్ చేస్తే అమెజాన్ దాన్ని క్యాన్సిల్ చేసిందని, కనుక తనకు న్యాయం చేయాలని అతను కోరాడు. ఈ క్రమంలో కొన్నేళ్ల పాటు సాగిన విచారణ తాజాగా ముగిసింది. ఫోరం అమెజాన్‌ను నష్టపరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది. అతనికి నష్ట పరిహారం కింద రూ.40వేలు, ఖర్చుల కింద మరో రూ.5వేలను అమెజాన్ చెల్లించాలని తీర్పు ఇచ్చింది. అవును.. రూ.190కి ల్యాప్ టాప్ అని చెప్పి కస్టమర్‌ను మోసం చేసినందుకు అమెజాన్ నష్ట పరిహారం చెల్లించాల్సిందే మరి.