ప్రపంచం మొత్తం ఒకరకమైన రికార్డులు నెలకొల్పితే.. భారతదేశంలో కూడా కొత్త కొత్త రికార్డులు సృష్టించేస్తోంది కరోనా. లాక్ డౌన్ సమయంలో కాస్త సైలంటుగా ఉన్నట్లుగానే కనిపించిన ఈ మహమ్మారి… లాక్ డౌన్ సడలింపులు కాస్త ఎక్కువగా ఇచ్చేసరికి, తన ప్రభావం బలం చూపిస్తుంది. లాక్ డౌన్ సమయంలో ఒకపక్కే చూపించాను.. సడలింపులతో రెండోపక్క చూపిస్తాను అంటుంది. ఇంతకూ తాజాగా కరోనా సృష్టించిన రికార్డులు ఏమిటనేది ఇప్పుడు చూద్దాం.
కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 2,16,919 మందికి వైరస్ సోకింది. అందులో 1,06,737 యాక్టివ్ కేసులు ఉండగా 1,04,106 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇక మరణాల విషయానికొస్తే… 6075 మరణాలు చోటుచేసుకున్నాయి. నిన్న ఒక్క రోజే 260 మంది వ్యాధితో మరణించారు. ఇక్కడ సరిగ్గా గమనిస్తే కరోనా వైరస్ ఏ రేంజ్ లో దూసుకుపోతుందో అర్ధమవుతుంది. మే 19వ తేదీన మొత్తం కేసులు 1,01,139 ఉండగా 3163 మంది మృతి చెందారు. 15 రోజుల తరువాత ఇప్పుడు దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,16,919 గా ఉంది. అంటే… రెండువారాళ్లో కేసుల సంఖ్య రెట్టింపు అయ్యిందన్నమాట. ఇదో రికార్డు!!
ఇక తెలంగాణ విషయానికి వస్తే.. బుధవారం 129 కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం వైరస్ కేసుల సంఖ్య 3020కి చేరింది. బుధవారం ఒక్కరోజే ఆ వైరస్తో ఏడుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు వైరస్ బారిన పడిన మృతి చెందిన వారి సంఖ్య 99కి చేరుకుంది. తాజా కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 108 కేసులు నమోదవగా రంగారెడ్డి జిల్లాలో 6, ఆసిఫాబాద్ లో 6, మేడ్చల్ సిరిసిల్లలో 2 కేసుల చొప్పున.. యాదాద్,రి కామారెడ్డి మహబూన్ నగర్ జిల్లాల్లో ఒక్కోటి చొప్పున కేసులు నమోదయ్యాయి.
ఏపీలో ఇప్పటివరకు ఉన్న మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3279కి చేరాయి. ఈ సమయంలో కరోనా పరీక్షల్లో ఏపీ రికర్డు సొంతం చేసుకుంది. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగు లక్షల మార్కును అధిగమించింది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 8,066 మందికి పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 4,03,747కు చేరింది. అంటే… ప్రతి పది లక్షల జనాభాలో 7,561 మందికి పరీక్షలు నిర్వహించిందన్న మాట. ఈ లెక్క అన్ని రాష్ట్రాల కంటే అధికం.. దీంతో కరోనా పరీక్షల విషయంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందన్నమాట.. ఇది మరో రికార్డు!!