బాంబే హైకోర్టు ఓ గర్భిణీ కేసు విషయంలో సంచలన తీర్పు ఇచ్చింది. ఆమె తన ఇష్టం ఉన్న హాస్పిటల్‌లో అబార్షన్ చేయించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఆ మహిళ 20 వారాల గర్భంతో ఉండడం విశేషం. కానీ ఆ మహిళ చెప్పిన మాటలను సావధానంగా విన్న కోర్టు చివరకు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
20 వారాల గర్భంతో ఉన్న తనకు అబార్షన్ చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఓ మహిళ తాజాగా బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తనకు ఇంకా పెళ్లి కాలేదని, ఓ వ్యక్తితో సహజీవనం చేశానని, ఆ తరువాత అతని నుంచి విడిపోయానని ఆమె కోర్టుకు తెలిపింది. అయితే తనకు పీరియడ్స్ నెల నెలా రాకపోవడంతో అనుమానం వచ్చి టెస్టులు చేయిస్తే తాను గర్భం దాల్చినట్లు రిపోర్టులో వచ్చిందని ఆమె పేర్కొంది. దీంతో తాను అబార్షన్ చేయించుకుందామనుకున్నానని, కానీ అప్పుడు మార్చి నెల.. లాక్‌డౌన్ అమలులో ఉందని ఆమె తెలిపింది. అందుకనే ఇప్పుడు తనకు అబార్షన్ చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరింది.
కాగా ఆమె వాదనలు విన్న కోర్టు వైద్యుల సహాయం తీసుకుంది. 20 వారాల గర్బం కనుక అబార్షన్ చేస్తే ఇబ్బందులు వస్తాయని వైద్యులు చెప్పారు. ఈ క్రమంలో కోర్టు వైద్యుల మాటలను ఆమెకు చెప్పింది. అయినప్పటికీ.. తాను గర్భం అలాగే ఉంచుకుని బిడ్డను కంటే పెళ్లి కాకుండా బిడ్డను కన్నావని అందరూ అవమానిస్తారని, అలాగే తన బిడ్డను అందరూ చిన్నచూపు చూస్తారని.. అప్పుడు ఆ బాధను భరించే కన్నా ఇప్పుడు కష్టమో, నష్టమో.. అబార్షన్ చేయించుకుంటేనే మంచిదని ఆమె కోర్టుకు విన్నవించింది. దీంతో కోర్టు ఎట్టకేలకు ఆమెకు అబార్షన్ చేయించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే సాధారణంగా ఇలాంటి కేసులు కోర్టుకు రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో వారు ఇచ్చే తీర్పులు అటు జనాల్లోనూ ఆసక్తిని కలిగిస్తుంటాయి.