రెండేళ్లు గడిచిన కరోనా ముప్పు తప్పడం లేదు. నిన్నటి వరకు ఓమిక్రాన్ తో భయపడ్డ ప్రపంచ దేశాలు మరో వేరియంట్ ను ఎదుర్కోబోతున్నాయా.. అంటే జౌననే సమాధానాలే వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఓమిక్రాన్ కరోనా వేరియంట్ నుంచి బయటపడుతున్న ప్రపంచదేశాలు మరో వేరియంట్ ను ఎదుర్కొనే అవకాశం కూడా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా మరో వేరియంట్ బ్రిటన్ లో బయటపడింది.
తాజాగా బ్రిటన్ లో బయటపడిన వేరియంట్ ఓమిక్రాన్, డెల్టా లక్షణాలు కలిగి ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. దీంతో దీనికి ‘డెల్టాక్రాన్’ అని నామకరణం చేశారు. దీనిపై యూకే పరిశోధకులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు, డెల్టాక్రాన్ ఎంత అంటువ్యాధి లేదా దాని లక్షణాలు ఎంత తీవ్రంగా ఉంటాయి అనే దాని గురించి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. డెల్టాక్రాన్ వేరియంట్‌ను గత ఏడాది చివర్లో సైప్రస్‌లో ఒక పరిశోధకుడు మొదటిసారిగా కనుగొన్నారు. యూనివర్శిటీ ఆఫ్ సైప్రస్‌లో పనిచేస్తున్న లియోనిడోస్ కోస్ట్రికిస్ తన బృందం డెల్టాక్రాన్ 25 కేసులను గుర్తించినట్లు పేర్కొన్నారు. అయితే దీనిపై మరింత పరిశోధనలు జరగాల్సి ఉంది.