వైరల్‌ వీడియో : ఈ పెళ్లి చూడండి… కలికాలం కాదు, కరోనా కాలం అంటారు..!

-

కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను మరోవైపు తిప్పింది. ఏవీ అనుకున్నట్లుగా జరగడం లేదు. ఇకముందు జరుగుతాయన్న గ్యారెంటీ కూడా లేదు. అలాంటిదే ఈ పెళ్లి. బహుదూరపు బంధంగా ముడేసుకుంది.

కరోనా రోగం.. మనుషుల ప్రాణాల కన్నా, వారి జీవితాలను చిదిమేస్తోంది. కళకళలాడుతుండాల్సిన నగరాలు, పట్టణాలు, పల్లెలు శ్మశాన నిశ్శబ్దాన్ని పాటిస్తున్నాయి. మనుషులు, మనస్తత్వాలు క్రమంగా మారిపోతున్నాయి. కరోనా తర్వాత కూడా మనుషుల మధ్య దూరాలు ఇలాగే పెరిగిపోతాయేమోనన్న భయం వెంటాడుతోంది. ఇటువంటి విషాదాల మధ్య ఓ విచిత్ర వివాహం జరిగింది. వధూవరుల మధ్య ఉన్న 2500 కి.మీ దూరం, కరోనా లాక్‌డౌన్‌ వారి పెళ్లిని మాత్రం ఆపలేకపోయింది.

లక్నోలో ఐటీ ఉద్యోగినిగా పనిచేస్తున్న అంజన (28) అనే అమ్మాయికి, కేరళ, కొట్టాయంలో ఉన్న శ్రీజిత్‌ నడేసన్‌ (30)తో పెళ్లి కుదిరింది. అంజనది కూడా కేరళలోని పల్లిప్పాడ్‌. ఉద్యోగరీత్యా లక్నోలో ఉంటుంది. కానీ లాక్‌డౌన్‌ కారణంగా పెళ్లి చేసుకోవడం కావడం లేదు. నిజానికి వారి పెళ్లి జనవరిలోనే కావాల్సింది. కానీ, ఇతర కారణాల రీత్యా ఏప్రిల్‌ 26కు వాయిదా పడింది. తీరా తేదీ దగ్గరి కొచ్చేసరికి, కరోనా లాక్‌డౌన్‌ వల్ల నిషేధాజ్ఞలు, అంతర్రాష్ట్ర ప్రయాణాలు లేకపోవడంతో వధువు అంజన కేరళకు వెళ్లలేకపోయింది.

ఇక్కడే ఆ జంట ఓ వినూత్నమైన ఆలోచన చేసింది. సాంకేతికత సహాయంతో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు… అదీ… ఓ వీడియో కాలింగ్‌ యాప్‌ ద్వారా.

ఆ పెళ్లి తాలూకు వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. దాన్లో, ఓ అబ్బాయి మొబైల్‌ఫోన్‌ పట్టుకుని ఉండగా, అందులో అమ్మాయి అంజన వధువు అలంకరణలో కూర్చుని ఉంటుంది. ఇటుపక్క అబ్బాయి నడేసన్‌, బంధువులందరూ హర్షధ్వానాలు చేస్తుండగా, ఆ ఫోన్‌కు మంగళసూత్రం కట్టాడు. అదే సమయంలో పెళ్లికూతురు, అక్కడి బంధువులు, తల్లిదండ్రులు చూస్తుండగా, ఇంకో తాళితో తన మెళ్లో తానే మూడుముళ్లు వేసుకుంది. .. అంతే…! ఆ జంటకు పెళ్లి జరిగిపోయినట్లే అని రెండు పక్కల పెళ్లివారు తీర్మానించేసారు.

ఈ లాక్‌డౌన్‌ కష్టాలు తీరిపోయిన తర్వాత బంధువులు, స్నేహితులందరినీ పిలిచి గ్రాండ్‌గా రిసెప్షన్‌ ప్లాన్‌ చేసుకుంటున్నారు ఆ నూతన వధూవరులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version