తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ రోజు ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 10రోజుల వరకు లాక్‌డౌన్ పెట్టనున్నట్టు ప్రకటించింది. అయితే మొన్నటి వరకు లాక్‌డౌన్ ఉండదని సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్‌కుమార్ పదేపదే చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో మినీ స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని అధికారులు నిర్ణయించారు. ఈనెల 15న తుది ఓటరు జాబితా కూడా విడుదల చేయాలని చూశారు.
అదేంటి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయాయి గదా అంటారా. అయిపోయాయి కానీ కొన్ని చోట్ల ఉప ఎన్నికలు, మరికొన్ని చోట్ల కేసులు పడటం వల్ల ఆగిపోయిన వాటికి ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు వీటిపై ఎఫెక్ట్ పడింది.
రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటించడం, కరోనా ఉధృతి ఎక్కువగా ఉండటంతో 97సర్పంచులు, రెండు ఎంపీపీలు, ఒక జడ్పీటీసీ, 1,083 గ్రామ వార్డులకు, 24ఎంపీటీసీ స్థానాలకు జరగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ పార్థసారథి నోటిఫికేషన్ విడుదల చేశారు. కరోనా తగ్గాకే వీటికి ఎలక్షన్స్ పెడతామని తెలిపారు.