రేపు కర్ణాటకలో జరగనున్న సిడబ్ల్యుసి సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు హాజరుకానున్నారు. మహాత్మా గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తవుతున్న సందర్బాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యేక భేటీ నిర్వహించనుంది. మహాత్మా గాంధీ బాధ్యతలు స్వీకరించిన కర్ణాటకలోని బెల్గాం లోనే ఈనెల 26, 27 తేదీలలో రెండు రోజులపాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తుంది.
ఈ భేటీకి నవ సత్యాగ్రహ బైఠక్ గా నామకరణం చేసింది. ఈ భేటీకి సిడబ్ల్యూసి సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, పీసీసీలు, సీఎల్పీ నేతలు, పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు, మాజీ ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఈ సమావేశానికి మొత్తంగా 200 మంది కీలక నేతలు హాజరవుతారని ఏఐసీసీ ప్రకటించింది.
ఇక తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, తదితరులు పాల్గొననున్నారు. ఇందుకోసం రేపు హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో బెల్గాం కి వెళ్ళనున్నారు.