రామ మందిరం నిర్మాణానికి భూమిపూజ ముహూర్తం సమీపిస్తున్న వేళ అయోధ్య నగరంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. రామ మందిరంలో ప్రధాన అర్చకుడికి సహాయకుడిగా ఉన్న పూజారి ప్రదీప్‌దాస్ కరోనా బారిన పడ్డారు. ఫలితంగా ఆయనను హోం క్వారంటైన్‌లో ఉంచారు.
అలాగే, ఆలయం వద్ద విధులు నిర్వహిస్తున్న 16 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్టు ట్రస్టు వెల్లడించింది.ఆగస్టు 5న జరగబోయే రామ మందిరం శంకుస్థాపన కార్యక్రమం నేపథ్యంలో అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా 50 మంది ప్రముఖులు విచ్చేస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో అన్ని భద్రతా చర్యలు తీసుకొని కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నట్టు ఆలయ ట్రస్ట్ తెలిపింది. కొందరు అతిథులు, పూజారులు, భద్రతా సిబ్బంది, స్థానికులతో కలిపి మొత్తం 200 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొంది.