కరోనా వైరస్‌పై చైనా మొదట్నుంచీ అనుమానాస్పదంగానే వ్యవహరిస్తూ వస్తోందన్న సంగతి తెలిసిందే. ఆ దేశంలో చాలా రోజుల ముందు నుంచే కరోనా వ్యాప్తి జరుగుతుందని.. అయినప్పటికీ అటు చైనా గానీ, ఇటు ప్రపంచ ఆరోగ్య సంస్థ గానీ పట్టించుకోలేదని, అందుకే కరోనా వైరస్ అంతగా వ్యాప్తి చెందిందనీ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలకు మరింత బలం చేకూర్చేలా మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. చైనాలో అసలు గతేడాది ఆగస్టులోనే కరోనా వైరస్ వ్యాప్తి మొదలైందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
హార్వార్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు తాజాగా కరోనా వైరస్ మొదట ఎలా వ్యాప్తి చెంది ఉంటుందనే విషయంపై పరిశోధన చేసి తమ రీసెర్చి వివరాలను వెల్లడించారు. గతేడాది ఆగస్టులోనే చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైందని చెప్పారు. అందుకు గాను వారు పలు శాటిలైట్ చిత్రాలను సాక్ష్యాలుగా చూపిస్తున్నారు. ఆ సమయంలో చైనాలో వూహాన్ హాస్పిటల్ బయట పార్కింగ్ ప్రదేశంలో పెద్ద ఎత్తున ఒకేసారి వాహనాల ట్రాఫిక్ పెరగడంతోపాటు సెర్చ్ ఇంజిన్లలో cough, diarrhoea తదితర పదాలతో పెద్ద ఎత్తున సమాచారాన్ని వెదికారని అన్నారు. దీన్ని బట్టి చూస్తే ఆ సమయంలోనే కరోనా వైరస్ చైనాలో వ్యాప్తి చెంది ఉంటుందని, ఆ తరువాత అది నెమ్మదిగా వూహాన్‌లో విస్తరించి ఉంటుందనే అనుమానాన్ని పరిశోధకులు వెలిబుచ్చారు.
అయితే దీనిపై అటు చైనా విదేశీ వ్యవహరాలా మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చున్‌యింగ్ స్పందిస్తూ.. అలాంటి అర్థం పర్థం లేని రీసెర్చిని, శాటిలైట్ చిత్రాలను ఆధారంగా చేసుకుని తమను నిందించడం సరికాదని, ఆ రీసెర్చిలో ఎంత మాత్రం నిజం లేదని.. కొట్టి పారేశారు.