ఆర్థిక క్రమశిక్షణ, అవసరమైన చోట నిధులను సద్వినియోగ పరుచుకోవడం ద్వారానే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి వేగవంతం అవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి, ఎన్ఈసీ చైర్మన్ శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోపాటు రాష్ట్రాల ఆదాయాల విషయంలోనూ ఇదే విధానం అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఆదివారం ఎన్ఈసీ (ఈశాన్య రాష్ట్రాల మండలి) 70వ ప్లీనరీ ముగింపు సమావేశంలో శ్రీ అమిత్ షా మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఎన్ఈఆర్ ప్రాంతం అభివృద్ధి జరగకుండా భారతదేశ అభివృద్ధి సంపూర్ణం కాదన్నది నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకే ఈ ప్రాంతంలో శాంతిస్థాపన కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయం తర్వాత ఈ ప్రాంతంలో పరిస్థితులు వేగంగా మారుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
దీనికితోడుగా ఈశాన్యరాష్ట్రాల్లో వరదల కారణంగా ఏటా జరుగుతున్ననష్టాన్ని తగ్గించే దిశగా కూడా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వరదలు, మాదక ద్రవ్యాల ప్రభావం లేని ఈశాన్య రాష్ట్రాల నిర్మాణం దిశగా అందరూ కలిసి పనిచేయాలన్నారు. ఈశాన్య రాష్ట్రం మిగిలిన భారతదేశంతో సమానంగా అభివృద్ధి చేందేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయని, ఇందుకోసం ఈ ప్రాంతంలోని రాష్ట్రాలన్నీ సంపూర్ణ సమన్వయంతో పనిచేసినప్పుడే సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం వ్యాపారానుకూల వాతావరణ నిర్మాణం జరగాలని, తద్వారా ఉపాధి కల్పన, సాధికారత పెరిగేందుకు వీలువతుందన్నారు.