చెరువులోకి దూకి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో శనివారం వేకువజామున వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. సత్తుపల్లి మండలం బుగ్గపాడుకు చెందిన పంతంగి కృష్ణారావు (55) ఆటో డ్రైవర్. ఆయన సీత (53)వ్యవసాయ కూలీగా పనిచేస్తుంటుంది. ఈ క్రమంలోనే భార్య భర్తలు ఇద్దరూ స్థానిక రావి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
దంపతులు ఇద్దరు రావి చెరువు వద్దకు వెళ్తున్న దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దంపతుల మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతుడికి ముగ్గురు కూతుర్లు, ముగ్గురు అల్లుళ్ళు ఉండగా.. దంపతుల మృతి గురించిన వివరాలు ఇంకా తెలియ రాలేదు.