నందకుమార్ ఈడీ విచారణకు కోర్టు అనుమతి

-

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా వున్న నందకుమార్‌ను ఒక రోజు ప్రశ్నించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు నాంపల్లి కోర్ట్ అనుమతించింది. అతడిని సోమవారం (డిసెంబరు 26న) రోజున చంచల్ గూడ జైల్లో ఈడీ అధికారులు విచారించనున్నారు. కేసుకు సంబంధించి నంద కుమార్ ను ప్రశ్నించి.. స్టేట్మెంట్ ను నమోదు చేయనున్నారు. ఈ కేసులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాత్రపై నందకుమార్ ను అధికారులు ప్రశ్నించనున్నారు.

ఇప్పటికే రోహిత్ రెడ్డిని రెండు రోజుల పాటు విచారించిన ఈడీ.. ఆయన బ్యాంకు లావాదేవీలతో పాటు కుటుంబసభ్యుల బ్యాంకు అకౌంట్లను పరిశీలించింది. ఈనెల 27న మరోసారి విచారణకు హాజరుకావాలని రోహిత్ రెడ్డికి నిర్దేశించింది. కాగా, మొయినాబాద్ ఫాం హౌస్ కేసు ఎఫ్ఐఆర్ ఆధారంగా.. ఈడీ అధికారులు ECIR నమోదు చేశారు. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందన్న అనుమానంతో ఈడీ విచారణను జరుపుతోంది.

ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ నిందితులతో మాట్లాడినట్లు సిట్ అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే ఆయనను విచారిస్తే పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ వాదిస్తోంది. ఈ కారణం చేత సిట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే దీనిపై బీఎల్ సంతోష్ హైకోర్టును ఆశ్రయించడంతో సిట్ నోటీసులపై న్యాయస్థానం స్టే విధించింది. మరోవైపు.. ఈ నెల 28న బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్‌లు తెలంగాణకు రానున్నారు. ఈ నేపథ్యంలో సిట్ ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు వున్నాయా అంటూ చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version