దేశీయ ఫార్మా దిగ్గజ సంస్థ భారత్ బయోటెక్ ఇప్పటికే తన కరోనా వ్యాక్సిన్ కోవ్యాక్సిన్‌ను ఫేజ్ 1, 2 క్లినికల్ ట్రయల్స్‌లో పరీక్షిస్తున్న విషయం విదితమే. అయితే ఈ వ్యాక్సిన్‌ను ఆ ట్రయల్స్‌లో వాలంటీర్లకు కండరాల ద్వారా ఇస్తున్నారు. కానీ ఈ వ్యాక్సిన్‌ను చర్మం ద్వారా ఇచ్చేందుకు గాను భారత్ బయోటెక్ తాజాగా అనుమతులు పొందింది. ఈ మేరకు ఆ కంపెనీకి ఐసీఎంఆర్ అనుమతులు ఇచ్చింది.
అయితే ఇప్పటికే చేపట్టిన కోవ్యాక్సిన్ ట్రయల్స్‌కు తాజాగా ట్రయల్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అలాగే ట్రయల్స్ డేటాను కూడా విడిగా విడుదల చేస్తారు. కాకపోతే వ్యాక్సిన్ ఇచ్చే విధానమే వేరేగా ఉంటుంది. కాగా కోవ్యాక్సిన్‌ను దేశవ్యాప్తంగా 12 చోట్ల 1125 మంది వాలంటీర్లకు ఇచ్చి భారత్ బయోటెక్ పరీక్షిస్తోంది. ఫేజ్ 1, 2 ట్రయల్స్ కొనసాగుతున్నాయి.
ఇక కోవ్యాక్సిన్ ఒక్క డోసు ఖరీదు వాటర్ బాటిల్ కన్నా తక్కువే ఉంటుందని ఆ కంపెనీ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల ఇది వరకే ప్రకటించారు. తమ వ్యాక్సిన్ కన్నా వాటర్ బాటిల్ ఖరీదు 5 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. కాగా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ దేశంలో ఇతర వ్యాక్సిన్ల కన్నా ముందే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.