కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో బుధవారం (12-08-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. దేశంలో కొత్తగా 60,963 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,39,639కి చేరుకుంది. 6,43,948 యాక్టివ్ కేసులు ఉండగా, 16,39,600 మంది కోలుకున్నారు. 46,091 మంది చనిపోయారు.
2. తెలంగాణలో కొత్తగా 1897 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 84,544కు చేరుకుంది. 22,596 మంది చికిత్స పొందుతున్నారు. 61,294 మంది కోలుకున్నారు. మొత్తం 654 మంది చనిపోయారు.
3. ఏపీలో కొత్తగా 9597 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,54,146కు చేరుకుంది. 90,425 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1,61,425 మంది కోలుకున్నారు. 2,296 మంది చనిపోయారు.
4. రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ను తమ దేశంలో అనుమతించబోమని కెనడా తెలిపింది. వ్యాక్సిన్‌కు సంబంధించి స్పష్టమైన సమాచారం లేదని.. అందువల్లే దాన్ని దేశంలోకి అనుమతించేది లేదని కెనడా స్పష్టం చేసింది.
5. కరోనా వ్యాక్సిన్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత్‌కు ఉందని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ విజయవంతమైతే దాని భద్రత, ప్రభావాన్ని అంచనా వేయాలని అన్నారు.
6. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యగ్నిక్ కరోనా బారిన పడ్డారు. బీసీసీఐ సూచన మేరకు ఫ్రాంచైజీలు తమ ప్లేయర్లు, సిబ్బందికి 2 సార్లు కరోనా టెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో దిశాంత్‌కు పాజిటివ్ అని నిర్దారణ అయింది. అయితే కరోనా నుంచి కోలుకున్నాక ఆయన దుబాయ్ వెళ్తారు.
7. కరోనా వైరస్ వచ్చిన వారిలో వెక్కిళ్లు కూడా ఎక్కువగా వస్తాయని అమెరికా సైంటిస్టులు తెలిపారు. అందువల్ల దీన్ని కరోనాకు కొత్త లక్షణంగా చెప్పవచ్చని వారు అన్నారు. కరోనాకు శ్వాస తీసుకోవడం, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు మొదట్లో ఉండేవి. తరువాత రుచి, వాసన కోల్పోవడం కూడా చేర్చారు. ఇప్పుడీ కొత్త లక్షణాన్ని చేర్చారు.
8. కర్ణాటకలో ఒక్క రోజే కొత్తగా 7,883 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,96,494కు చేరుకుంది. 3,510 మంది చనిపోయారు. 1,12,633 మంది కోలుకున్నారు. 80,343 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
9. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ వై నాయక్‌కు కరోనా సోకింది. బుధవారం ఆయన పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. అయితే ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. దీంతో ఆయన ఇంట్లోనే కరోనా చికిత్స తీసుకుంటున్నారు.
10. రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌కు గాను మొదటి బ్యాచ్ డోసులను మరో 2 వారాల్లో సిద్ధం చేయనున్నారు. వ్యాక్సిన్‌ను ముందుగా అక్కడ అత్యవసర సేవలను అందించే సిబ్బందికి ఇవ్వనున్నారు. అక్టోబర్‌లో వ్యాక్సిన్‌ను ప్రజలకు పంపిణీ చేస్తారు.