కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో ఆదివారం (12-07-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. ప్రముఖ బాలీవుడు నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌లకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం విదితమే. ఆదివారం అభిషేక్ భార్య ఐశ్వర్యా బచ్చన్, కుమార్తె ఆరాధ్య బచ్చన్‌లకు కరోనా పరీక్షలు చేయగా.. వారికి కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో బచ్చన్ కుటుంబం మొత్తం ప్రస్తుతం ముంబై నానావతి హాస్పిటల్‌లో కోవిడ్ చికిత్స తీసుకుంటోంది. మరోవైపు వారి నివాసాన్ని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ శానిటైజ్ చేసి సీజ్ చేసింది.
2. రష్యాలో సెచెనోవ్ యూనివర్సిటీ పరిశోధకులు తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్‌కు హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయి. మొదటి రెండు ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇచ్చింది. వ్యాక్సిన్‌ను తీసుకున్న వారు కోవిడ్ నుంచి తట్టుకున్నారు. ఈ క్రమంలో చివరి దశ ట్రయల్స్‌ను ప్రారంభించారు.
3. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన కరోనా చికిత్స అందించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. ప్రభుత్వ హాస్పిటళ్ల పట్ల ప్రజల్లో నమ్మకం పెంచాలన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలని అన్నారు.
4. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,827 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,54,427కి చేరుకుంది. తమిళనాడులో కొత్తగా 4,244 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,38,470కి చేరుకుంది.
5. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో మొత్తం 1269 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 34,671కి చేరుకుంది. మొత్తం 11,883 మంది చికిత్స పొందుతుండగా, 22,482 మంది కోలుకున్నారు. 356 మంది చనిపోయారు.
6. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కోవిడ్ నియంత్రణకు 4 ‘T’ లను పాటించాలన్నారు. టెస్ట్, ట్రేస్, ట్రీట్, టీచ్ అనే విధానాల ద్వారా కోవిడ్‌పై పోరాటం చేయాలన్నారు. రాజ్‌భవన్‌లో మొత్తం 10 మందికి కరోనా వచ్చిన నేపథ్యంలో గవర్నర్ పరీక్షలు చేయించుకున్నారు.
7. కరోనా కట్టడికి యూపీలో శని, ఆది వారాల్లో పూర్తిగా లాక్‌డౌన్ విధించనున్నారు. కేవలం బ్యాంకులు, పరిశ్రమలు మాత్రమే నడవనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, మార్కెట్లను మూసి వేస్తారు. అలాగే వారాంతాల్లో జరిగే సామాజిక కార్యకలాపాలపై కూడా ఆంక్షలు విధించారు. కేవలం అత్యవసర సరుకుల రవాణా, పరిశ్రమల ఉత్పత్తి వంటి కార్యకలాపాలకు మాత్రమే అనుమతి ఉంటుంది.
8. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కోవిడ్‌పై భారత్ చేస్తున్న యుద్దాన్ని ప్రపంచమంతా గమనిస్తుందని ఆయన అన్నారు. కోవిడ్ పరంగా ఇతర దేశాల కన్నా మనం మెరుగైన స్థానంలోనే ఉన్నామన్నారు.
9. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 27,114 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,20,916కు చేరుకుంది. మొత్తం 2,83,407 మంది చికిత్స పొందుతున్నారు. 22,123 మంది చనిపోయారు.
10. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు మాస్క్ ధరించారు. గతంలో ఆయన పలుమార్లు మాస్క్ ధరించనని బహిరంగంగానే చెప్పారు. అయినప్పటికీ తాజాగా ఆయన మాస్కు ధరించి దర్శనమిచ్చారు. అయితే మాస్క్ ధరించడానికి తాను వ్యతిరేకం కాదని, కానీ ఎప్పుడు పడితే అప్పుడు మాస్కు ధరించాల్సిన పనిలేదని అన్నారు.