దేశంలో అన్ని మెట్రోపాలిటన్ నగరాల కన్నా ప్రస్తుతం ముంబైలోనే పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌ను నియంత్రించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతోంది. అయితే ముంబైలోనే నివాసం ఉంటున్న బచ్చన్ కుటుంబం మొత్తానికి కరోనా వచ్చిందని ఆదివారం పరీక్షల్లో తేలింది. అమితాబ్, అభిషేక్‌లకు కరోనా ఉన్నట్లు శనివారం రాత్రి వెల్లడైంది. ఆదివారం ఐశ్వర్య, ఆరాధ్య బచ్చన్‌లకు కూడా కరోనా ఉన్నట్లు నిర్దారణ అయింది. దీంతో వారందరూ కోవిడ్ చికిత్స తీసుకుంటున్నారు.
అయితే ఉన్నట్టుండి సడెన్‌గా వీరికి కరోనా ఎలా సోకిందని అనేక సందేహాలు వస్తున్నాయి. కాగా.. అభిషేక్ బచ్చన్ జూలై 8వ తేదీన ముంబైలోని వెర్‌సోవా అనే స్టూడియోకు డబ్బింగ్ కోసం వెళ్లాడు. దీంతో అతనికి అక్కడ కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. ఇక బచ్చన్‌ల కుటుంబం నివసిస్తున్న జల్సా నివాసం ముంబైలోని అంధేరిలో ఉంది. నిజానికి ఆ ప్రాంతంలో ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో అది కోవిడ్ హాట్‌స్పాట్‌గా మారింది. ఈ క్రమంలో లోకల్‌గా వారికి.. సమూహ వ్యాప్తి ద్వారా కరోనా వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు.
ఇక అమితాబ్ నివాసంలో పనిచేస్తున్న వారికి కూడా ప్రస్తుతం కరోనా టెస్టులు చేస్తున్నారు. మరోవైపు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అమితాబ్ ఇల్లు.. జల్సాను సీజ్ చేసింది. శానిటేషన్ చర్యలు చేపట్టాక కొద్ది రోజులకు సీల్ తొలగించనున్నారు.