కరోనా నేపథ్యంలో చాలా మంది జాబ్‌లను పోగొట్టుకున్న తరుణంలో అలాంటి నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాల్లో మోసాలు చేస్తూ డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా బెంగళూరులో 10-రుపీ గ్యాంగ్ పేరిట ఓ ముఠా ఉద్యోగాలిప్పిస్తామని చెబుతూ నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేస్తోంది. గత 10 రోజుల్లోనే 10 మంది బాధితులు నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో సదరు మోసగాళ్లు చేసిన మోసాలపై ఫిర్యాదులు చేయడం కలకలం రేపుతోంది.
బెంగళూరులోని హనుమంతనగర్‌కు చెందిన కె.రాధ అనే మహిళకు నవంబర్ 27న 10-రుపీ గ్యాంగ్‌కు చెందిన ఒక వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వారు ఆమెకు ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తామని, అందుకు కేవలం రూ.10 మాత్రమే ప్రాసెసింగ్ ఫీజు అవుతుందని చెప్పే సరికి ఆమె నమ్మింది. దీంతో వారు ఆమెకు ఒక లింక్ పంపించారు. అందులో ఆమె వ్యక్తిగత వివరాలతోపాటు బ్యాంకు డెబిట్ కార్డు వివరాలను అడిగే సరికి ఆమె ఆ వివరాలను అందులో నింపింది. తరువాత ఆమె తనకు వచ్చిన ఓటీపీని సైతం వారికి తెలిపింది. దీంతో అకౌంట్ నుంచి మొదటి విడతలో రూ.2వేలు డెబిట్ అయ్యాయి. తరువాత మరో మూడు ట్రాన్సాక్షన్లలో మొత్తం కలిపి రూ.42,010 ని ఆమె అకౌంట్ నుంచి కాజేశారు. విషయం తెలుసుకున్న ఆమె సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇక కోరమంగళ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల ఆర్.మల్లిక ఆనే మహిళ పైన తెలిపిన విధంగానే రూ.1.90 లక్షలు నష్టపోయింది. మథికెరె ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల హెచ్‌జీ అనూష ఈ విధంగానే రూ.16,982 పోగొట్టుకోగా బాధితులందరూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 10 రోజుల్లోనే 10-రుపీ గ్యాంగ్ చేసిన మోసాలపై 10 మందికి పైగానే బాధితులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.
కాగా 10-రుపీ గ్యాంగ్ చేస్తున్న మోసాలపై పౌరులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఉద్యోగాలిప్పిస్తామని ఎవరైనా చెబితే నమ్మవద్దని, అలాంటి వ్యక్తులకు డబ్బులు చెల్లించవద్దని, ఎవరూ కూడా డబ్బులు తీసుకుని ఉద్యోగాలను ఇప్పించరని, అంతా మోసం జరుగుతుందని అన్నారు. అలాగే ఎవరూ కూడా తమ వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ సమాచారాన్ని ఇతరులకు చెప్పకూడదని పోలీసులు హెచ్చరించారు.