విషవాయువు 31 కోతులు, 14 పావురాలను బలిగొన్నది. ఈ ఘటన మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో చోటు చేసుకున్నది. రాయ్‌గఢ్ జిల్లాలోని పన్వేల్ సమీపంలోని పోశ్రీ అనే ప్రాంతంలో ఉన్న ఓ నైట్రిక్ యాసిడ్ ప్లాంట్ నుంచి లీకైన విష వాయువు వల్లే కోతులు, పావురాలు చనిపోయినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటన గత గురువారం రాత్రే చోటు చేసుకున్నా… ఆదివారం వెలుగులోకి వచ్చింది. గత గురువారం రాత్రి చనిపోయిన కోతులు, పావురాల మృతదేహాలను ప్లాంట్ సిబ్బంది ఎవరికీ తెలియకూడదని.. అక్కడే వాటిని పాతి పెట్టారు. ఆ ఘటన గురించి ఎవ్వరికీ చెప్పలేదు.
కోతులు, పావురాల మరణం గురించి అటవీ అధికారులకు తెలియడంతో వాళ్లు వెంటనే మహారాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు సమాచారం అందించారు. పోలీసుల సాయంతో అక్కడికి చేరుకున్న అధికారులు పాతిపెట్టిన కోతులు, పావురాల మృతదేహాలను వెలికితీశారు. వాటికి పంచనామా నిర్వహించి.. వాటిని పరీక్షల కోసం హాఫ్‌కిన్స్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు.
నిజానికి ఈ ప్రాంతం హిందూస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెట్ కంపెనీకి చెందింది. కానీ.. ఈ ప్రాంతాన్ని ఆ కంపెనీ ఇటీవలే ఇస్రో, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌కు బదలాయించినట్టు సమాచారం. కోతులు, పావురాల చావుకు తమ సంస్థలకు ఎటువంటి సంబంధం లేదని ఈ మూడు కంపెనీలు స్పష్టం చేశాయి. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.