డాక్టర్ల నిర్లక్ష్యం.. కాలు కోల్పోయిన 6 ఏళ్ల చిన్నారి..!

-

అక్షర తల్లిదండ్రులు ఆమెను సికింద్రాబాద్‌లో ఉన్న యశోద ఆసుపత్రిలో చూపించారు. అక్కడ వైద్యులు ఆమెకు పరీక్షలు చేసి కాలు విషపూరితం అయిందని, వెంటనే కాలును తీసేయకపోతే ప్రాణానికే ప్రమాదమని చెప్పారు.

డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అభం శుభం తెలియని ఓ 6 ఏళ్ల చిన్నారి తన కాలు కోల్పోవాల్సి వచ్చింది. హైదరాబాద్ నగరంలోని సనత్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గత నెలలోనే ఈ సంఘటన జరిగినా ఇప్పుడీ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో నివాసం ఉండే చంద్రశేఖర్, పావనిల కుమార్తె అక్షర (6) మే 13వ తేదీన తమ ఇంట్లో ఆడుకుంటుండగా.. ఇంట్లో ఉన్న కప్‌బోర్డ్ విరిగి ఆమె కాలుపై పడింది. దీంతో ఆమె కుడి కాలుకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆమె తల్లిదండ్రులు ఆమెను స్థానికంగా ఉన్న నీలిమ హాస్పిటల్‌కు తరలించారు. అయితే అక్కడి సిబ్బంది, వైద్యులు అక్షరకు తగిలింది సాధారణ గాయమే అని చెప్పి సరిగ్గా పరీక్షలు చేయకుండానే ఆమెకు సాధారణ కట్టు కట్టి పంపించారు.

కానీ అక్షర మాత్రం కాలులో తీవ్రమైన నొప్పి ఉందని చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కట్టు విప్పి చూడగా ఆ ప్రాంతమంతా నీలిరంగులోకి మారింది. ఈ క్రమంలో అక్షరను మళ్లీ వారు అదే హాస్పిటల్‌కు తరలించగా.. వారు ఆమెకు చికిత్సను అందించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో అక్షర తల్లిదండ్రులు ఆమెను సికింద్రాబాద్‌లో ఉన్న యశోద ఆసుపత్రిలో చూపించారు. అక్కడ వైద్యులు ఆమెకు పరీక్షలు చేసి కాలు విషపూరితం అయిందని, వెంటనే కాలును తీసేయకపోతే ప్రాణానికే ప్రమాదమని చెప్పారు. ఆ తరువాత అక్షరను ఆమె తల్లిదండ్రులు పలు హాస్పిటల్స్‌లో చూపించినా అందరూ కాలు తీసేయాల్సిందేనని అన్నారు. దీంతో వారు చేసేది లేక సికింద్రాబాద్ కిమ్స్‌లో అక్షరకు ఆపరేషన్ చేయించి ఆమె కాలును తీసేయించారు.

ఇక తమ కుమార్తె చికిత్స పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పి అక్షర తల్లిదండ్రులు నీలిమ హాస్పిటల్‌పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే సదరు హాస్పిటల్ స్థానికంగా ఉన్న ఓ రాజకీయ నాయకుడికి చెందినది కావడంతోనే పోలీసులు నెల రోజులు అవుతున్నా.. ఇంకా హాస్పిటల్‌పై చర్యలు తీసుకోలేదని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు పోలీసులు మాత్రం తమకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి వివరాలు అందలేదని, అవి వస్తే.. హాస్పిటల్, దాని సిబ్బంది, డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని చెబుత్నునారు. ఏది ఏమైనా.. ఓ పనికిమాలిన హాస్పిటల్, దాని సిబ్బంది, డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓ అభం శుభం తెలియని చిన్నారి మాత్రం తన కాలును కోల్పోయింది. ఇలాంటి బాధ ఏ తల్లిదండ్రికీ రాకూడదు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version