ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎక్స్‌ప్రెస్ టీవీ మాజీ చైర్మన్ చిగురుపాటి జయరాం శుక్రవారం ఉదయం ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఐతవరం దగ్గర హైవే పక్కన ఓ గోతిలో కారు కనిపించడంతో అక్కడికి వెళ్లిన స్థానికులు కారులో అచేతన స్థితిలో పడి ఉన్న వ్యక్తిని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా.. అది జయరామ్‌దిగా తేలింది.
అయితే.. జయరామ్ మృతి అనుమానాస్పదంగా ఉండటంతో ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. ఆయన హత్య కేసులో ప్రధాన సూత్రధారి శిఖా చౌదరి అని పోలీసులు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఆయన్ను హత్య చేయడానికి సైనెడ్ వాడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. శిఖా చౌదరి.. జయరాంకు బంధువని.. ఆమె పేరు మీదకు తన ఆస్తులను జయరామ్ మార్చాడని.. కాకపోతే ఆమెకు డాక్యుమెంట్లు ఇవ్వకుండా తన దగ్గరే దాచుకున్నాడని వెల్లడైనట్టు సమాచారం. ఆ డాక్యుమెంట్ల కోసమే శిఖా.. జయరామ్‌ను చంపేసిందా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
హత్య జరిగిన రోజు ఆయన కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఈ యువతి శిఖా కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న శిఖా ఫ్రెండ్ రాకేశ్, అతడి డ్రైవర్‌ను పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం.