గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి వద్ద బస్సులో దోపిడీ జరిగింది. పెద్దాపురం డీఎస్పీ రామారావు తెలిపిన వివరాల ప్రకారం… నెల్లూరుకు చెందిన వినోద్‌రాయ్, రఘురాజరావు అనే అన్నదమ్ములు బంగారు నగల వ్యాపారం చేస్తున్నారు. తాము తయారుచేసిన నగలను విశాఖలోని వివిధ దుకాణాల వారికి చూపించిన వారిద్దరూ సోమవారం రాత్రి 4.5 కిలోల నగలతో నెల్లూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో బస్సు గండేపల్లి మండలం మల్లేపల్లి శివారు జాతీయ రహదారి పక్కన ఉన్న న్యూ కరుణ్‌కుమార్ దాబా వద్ద ఆగింది. దీంతో వారు భోజనం చేసేందుకు బ్యాగుతో సహా కిందికి దిగారు. అయితే వారి వద్ద బంగారు నగలు ఉన్నట్లు తెలుసుకున్న దుండగులు ఆ బ్యాగును లాక్కుని పరారయ్యారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దోపిడీకి గురైన ఆభరణాల విలువ సుమారు రూ.కోటి ఉండొచ్చని డీఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.