చిన్నారిపై స్కూల్ బస్​​ డ్రైవర్​ అత్యాచారం.. బుల్డోజర్​ ప్రయోగించిన మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం

-

నర్సరీ చదువుతున్న మూడున్నరేళ్ల చిన్నారిపై స్కూల్ బస్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటనపై మధ్యప్రదేశ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రేప్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ బస్సు డ్రైవర్ ఇంటిని అధికారులు బుల్డోజర్‌తో కూల్చివేశారు. మరోవైపు చిన్నారిపై అతడు అత్యాచారం చేసినట్లు తేలితే చర్యలు తీవ్రంగా ఉంటాయని పోలీసులు తెలిపారు.

అసలేం జరిగిందంటే.. మూడున్నరేళ్ల చిన్నారి రోజూలాగే ఈనెల 13న పాఠశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు స్కూల్​ బస్సుకు ఎక్కింది. ఆ చిన్నారిపై కన్నేసిన బస్సు డ్రైవర్ ఆ పసికందుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బస్సులో ఉన్న మహిళా అటెండర్​ సాయంతో బ్యాగ్​లోని దుస్తులను తీసి చిన్నారి డ్రెస్​ను మార్చేశాడు. అనంతరం పాపను ఇంటి వద్ద దింపేశాడు.

పాప ఒంటిపై వేరే దుస్తులు ఉన్న విషయాన్ని గమనించిన చిన్నారి తల్లి.. స్కూల్​ యాజమాన్యాన్ని ఆరా తీసింది. వారు ఆ పని మేము చేయలేదని వివరణ ఇచ్చారు. అనంతరం, చిన్నారి తన ప్రైవేట్ భాగాల్లో​ నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు చిన్నారిని దగ్గరికి తీసుకొని ఏం జరిగిందో చెప్పాలని అడిగారు. దీంతో చిన్నారి అసలు విషయం చెప్పింది. బస్సు డ్రైవర్ తనతో చెడుగా ప్రవర్తించాడని, దుస్తులు కూడా అతడే మార్చాడని తెలిపింది.

మరుసటిరోజు పాపను తీసుకుని స్కూల్​కు వెళ్లగా నిందితుడిని చిన్నారి గుర్తుపట్టింది. ఆగ్రహించిన తల్లిదండ్రులు సోమవారం పోలీస్​స్టేషన్​లో వారిద్దరిపై ఫిర్యాదు చేశారు. సెక్షన్​ 376-ఏబీ, పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణను ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version