గతనెల 31న ఆత్మహత్య చేసుకున్న ఐఐటీ హైదరాబాద్ ఎంటెక్ విద్యార్థి రాహుల్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన గదిలో ఒక నోట్ పుస్తకంలో ‘ఇంపార్టెంట్ టెక్ట్స్… ప్లీజ్ సీమై ల్యాప్‌టాప్’ అని కనిపించింది. లాక్ తెరిపించి అందులో ఉన్న వాంగ్మూలాన్ని(సూసైడ్ లెటర్) పోలీసులు కనుగొన్నారు. అందులో ఏం ఉందంటే..?
‘‘నాకు జీవించాలని లేదు. ప్లేస్‌మెంట్స్ ఒత్తిళ్లు, థీసిస్, భవిష్యత్తులో ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలే ఇందుకు కారణం. ప్రతిరోజూ ఒత్తిడికి గురవుతున్నా. చాలామంది విద్యార్థులు ప్లేస్‌మెంట్స్ కోసమే ఎంటెక్‌లో ప్రవేశిస్తారు. అలాంటప్పుడు థీసిస్ ఎందుకు? ట్రిపుల్ ఐటీ బెంగళూరులో థీసిస్‌కు బదులుగా ఇంటర్న్‌షిప్‌ను అందుబాటులోకి తెచ్చారు. థీసిస్ కోసం ఏ విద్యార్థినీ ఒత్తిడి చేయకండి. నా నిర్ణయానికి గైడ్ కారణం కాదు.. కేవలం భవిష్యత్తు మీద భయం మాత్రమే. ఒత్తిడి నుంచి బయటపడేందుకు మద్యపానం, ధూమపానానికీ అలవాటుపడ్డా. ఒత్తిడిని జయించలేకపోయా. అమ్మా, నాన్నా.. నా అవయవాలను దానం చేయండి. నాన్నా… నాకు ఆశ్చర్యమేస్తోంది. నువ్వు ఇన్ని రోజులు నీ జీవితంలో సమస్యలతో ఎలా పోరాడావు. ఈ చిన్నదాన్నే నేను హ్యాండిల్ చేయలేకపోతున్నా’ 2019లో జరిగిన మూడు ఆత్మహత్యల ఘటనల నుంచి ఐఐటీ ఏమీ నేర్చుకోలేదు. విద్యార్థులకు స్టయిఫండ్‌ను సకాలంలో ఇవ్వాలి’’ అంటూ ల్యాప్‌టాప్‌లో రాసిన లేఖలో విద్యార్థి రాహుల్ పేర్కొన్నాడు.
మరోవైపు.. ఐఐటీ హైదరాబాద్‌లో కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ప్రత్యేక కేంద్రం ఉందని ఎస్పీ రమణకుమార్ వివరించారు. అయినా ఆ సదుపాయాన్ని రాహుల్ వాడుకోలేదన్నారు. ఈ నెల 6న పోతిరెడ్డిపల్లిలోని భవనం పైనుంచి దూకి చనిపోయిన ఐఐటీ పూర్వ విద్యార్థి మేఘ్‌కపూర్ గదిలో ఎలాంటి లేఖా లభించలేదన్నారు. విద్యార్థులు ఏదైనా సమస్య ఉంటే తమ సాయం తీసుకోవాలని ఆయన కోరారు.