ఓ గర్భిణీకి హెచ్ఐవీ రక్తం ఎక్కించారని మనం ఇటీవలే పేపర్లలో చూశాం కదా. ఇప్పుడు ఆ రక్తం ఇచ్చిన దాత ఆత్మహత్య చేసుకున్నాడు. అవును… తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందదిన ఓ యువకుడు శివకాశిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తం దానం చేశాడు. అయితే.. ఆ రక్తాన్ని డాక్టర్లు టెస్ట్ చేయకుండానే సత్తూర్ లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ రక్తాన్ని అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణీకి ఎక్కించారు.
అయితే.. అప్పుడు ఆ యువకుడికి హెచ్ఐవీ ఉన్న విషయం ఎవ్వరికీ తెలియదు. కానీ.. తర్వాత ఆ యువకుడు వైద్య పరీక్షలు చేయించుకుంటే హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే శివకాశిలో తను రక్తమిచ్చిన ఆసుపత్రిని సంప్రదించాడు. అప్పటికే ఆ రక్తాన్ని వేరే ఆసుపత్రికి తరలించామని.. ఆ రక్తాన్ని ఓ గర్భిణీకి ఎక్కించారని డాక్టర్లు చెప్పారు. దీంతో వెంటనే ఆ గర్భిణీకి టెస్టులు చేయగా.. ఆ గర్భిణీకి హెచ్ఐవీ సోకినట్టు తేలింది. ఆసుపత్రి సిబ్బంది రక్తానికి పరీక్షలు నిర్వహించకుండా ఓ గర్భిణీకి రక్తాన్ని ఎక్కించి ఆమెకు కూడా హెచ్ఐవీని సోకేలా చేయడంతో మనస్థాపం చెందిన ఆ యువకుడు తన ఇంట్లో ఎలుకల మందు తాగాడు. వెంటనే అప్రమత్తమైన అతడి కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ… ఆ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.