టీడీపీ అధినేత చంద్రబాబు, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిల మధ్య ఎలాంటి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పార్టీలు వేరైనా సరే ఇద్దరు నాయకుల మధ్య సత్సంబంధాలు బాగానే ఉన్నాయని తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఎప్పుడు చర్చ నడుస్తూనే ఉంటుంది. అందుకే రేవంత్ రెడ్డికి పిసిసి పదవి వచ్చినా సరే దానికి కారణం చంద్రబాబే అని ప్రత్యర్ధుల నుంచి విమర్శలు వచ్చాయి. ఇటు తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులు, అటు ఏపీలో వైసీపీ నాయకులు సైతం, చంద్రబాబు-రేవంత్‌ల మధ్య ఉన్న బంధంపై తీవ్ర విమర్శలు చేశారు.
అయితే రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఉన్నా సరే రేవంత్ వెనుక చంద్రబాబు ఖచ్చితంగా ఉండే ఉంటారని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. కేసీఆర్‌కు చెక్ పెట్టడానికి చంద్రబాబు, రేవంత్ ద్వారా రాజకీయం నడిపిస్తున్నారని అంతా అనుకుంటున్నారని చెబుతున్నారు. ఇక చంద్రబాబు, రేవంత్‌ల మధ్య బంధం అనేక సార్లు బయటపడుతూనే వచ్చిందని గుర్తు చేస్తున్నారు.
తాజాగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ తాజాగా చంద్రబాబుతో మంతనాలు జరపడం కూడా సంచలనంగా మారింది. తాజాగా ఏపీ పిసిసి అధ్యక్షుడు శైలజానాథ్ కుమారుడు పెళ్లి కార్యక్రమంలో చంద్రబాబుతో మధుయాష్కీ పలు రాజకీయ అంశాలపై చర్చ చేసినట్లు తెలుస్తోంది. ప్రచార కమిటీ ఛైర్మన్ గా మధుయాష్కీ ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో ఎంత దూకుడుగా ఉంటున్నారో తెలిసిందే. రేవంత్ రెడ్డికి సపోర్ట్‌గా ఉంటూ, కేసిఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అలాంటి నాయకుడు ఇప్పుడు చంద్రబాబుతో రాజకీయ పరిస్తితులపై చర్చలు చేసినట్లు సమాచారం. మొత్తానికైతే రేవంత్‌కు బాబు అభయహస్తం ఇస్తున్నట్లు కనిపిస్తోంది.