ఆ ముగ్గురు లాంటి నేత‌లు కావాలంటున్న రేవంత్‌.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

-

టీపీసీసీ చీఫ్‌గా మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి నియమితులైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఫుల్ జోష్ కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ సభలకు జనం విపరీతంగా వస్తుండటం మనం చూడొచ్చు. ఇకపోతే రేవంత్ స్పీచ్‌లు కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజం నింపుతున్నాయి.

రేవంత్ రెడ్డి | Revanth Reddy

ఈ క్రమంలోనే రేవంత్ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కల్లా కాంగ్రెస్ పార్టీని బలంగా క్షేత్రస్థాయిలో నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే యూత్ కాంగ్రెస్ నేతల సమావేశంలో రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన నాయకులందరూ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినవారేనని పేర్కొన్నారు.

 

దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి, విభజిత ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు ఈ ముగ్గురూ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వారేనని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే యూత్ కాంగ్రెస్ నేతలు పార్టీ బలోపేతానికి సీరియస్‌గా కష్టపడాలని సూచించారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో యువ రక్తం నాయకులు నేతలుగా ఎదగాలని వారికే బంగారు భవిష్యత్తు ఉంటుందని రేవంత్ తెలిపారు. మొత్తంగా పార్టీలో యూత్ నేతలు ఉండటం ద్వారా ఈ తరం పాలిటిక్స్ చేయాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున హుజురాబాద్ బరిలో ఉండే అభ్యర్థి ఎవరు అనేది రేవంత్ ఇంకా ప్రకటించలేదు.

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని బీజేపీ బలమైన ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఇప్పుడు మూడో శక్తిగా ఎంట్రీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ నేతృత్వంలో బలమైన పార్టీ ఎదుగుతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్వహించిన సభలు సక్సెస్ కాగా, మూడో సభ వరంగల్ జిల్లాలోని హసన్‌పర్తిలో ఉండబోతున్నదని సమాచారం. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతారనే వార్తలు వస్తున్నాయి. అయితే, ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు చేయలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version