గణేష్ నిమజ్జనం (సెప్టెంబర్-2022) ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం బీఆర్కేఆర్ భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, అడిషన్ డీజీ జితేందర్, పోలీస్ కమిషనర్ల సీవీ ఆనంద్, మహేశ్ భగవత్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. గణేశ్ నిమజ్జనం ఏర్పాట్లపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో కాలుష్య కారకమైన వినాయకుడి విగ్రహాలను ఉపయోగించొద్దని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ మేరకు నగరంలో మట్టి విగ్రహాలు వినియోగించేలా.. ప్రజలను చైతన్య పరచాలని అన్నారు. పర్యావరణాన్ని హాని చేసే.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, సింథటిక్ కలర్లు, కెమికల్స్ వాడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పీఓపీతో తయారు చేసే విగ్రహాలను ట్యాంక్‌బండ్‌తోపాటు నగరంలోని ఇతర చెరువుల్లో నిమజ్జనం చేయవద్దని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో మట్టి వినాయకుల తయారీదారులను ప్రోత్సాహించాలన్నారు.