సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా తెలంగాణ సీఎస్ శాంతికుమారి తమ ఇంట్లోని సభ్యుల వివరాలను నమోదు చేశారు. ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్లకు కుటుంబ వివరాలు అందించారు. రాష్ట్రంలో కులగణన కోసం నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో ఇప్పటికే కోటి కుటుంబాలకు పైగా వివరాలను నమోదు చేసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 6వ తేదీన మొదలైన ఇంటింటి సర్వే 17వ రోజు శనివారం నాటికి 90 శాతం పూర్తి కాగా, ఏడు జిల్లాల్లో 100 శాతం పూర్తయ్యింది.
సమగ్ర కులగణన సర్వే భవిష్యత్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు మేలు చేస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో ఆయా వర్గాలు కులగణన సర్వేలో ఉత్సాహంగా పాల్గొంటున్నాయి. జన సాంద్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో సర్వే కొంత నెమ్మదిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈనెలాఖరు వరకు వంద శాతం సర్వే పూర్తవుతుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.