ఆన్‌లైన్‌లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఎంత చెబుతున్నా కొందరు పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున డబ్బు నష్టపోతున్నారు. ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయినప్పటికీ ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మోసాల బారిన పడుతున్నారు. తాజాగా పూణెకు చెందిన ఓ మహిళ సైబర్ మోసగాళ్ల బారిన పడి ఏకంగా రూ.3.98 కోట్లు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే..
పూణెకు చెందిన ఓ మహిళకు ఏప్రిల్ 2020లో బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి నుంచి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దీంతో ఆమె రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసి అతనితో చాటింగ్ చేసింది. తరువాత వారు స్నేహితులు అయ్యారు. అయితే ఆ వ్యక్తి ఆమెకు బర్త్ డే గిఫ్ట్ కింద ఐఫోన్, బంగారు ఆభరణాలు, ఇతర లగ్జరీ వస్తువులను పంపించానని, కానీ ఢిల్లీలో కస్టమ్స్ వద్ద చిక్కుకుపోయాయని, వాటిని విడిపించాలంటే డబ్బు కావాలని అడిగాడు. దీంతో ఆమె నిజమే అని నమ్మింది.
ఇక ఆ తరువాత.. అంటే సెప్టెంబర్ 2020 నుంచి ఆమె విడతల వారీగా అతనికి డబ్బు పంపించింది. మొత్తం 207 ట్రాన్సాక్షన్లలో 27 భిన్న అకౌంట్ నంబర్లకు ఆమె రూ.3.98 కోట్లను పంపించింది. అయితే చివరకు ఆ వ్యక్తి నుంచి రిప్లై లేకపోవడంతో ఆమె తాను మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.