ఎన్‌-95 మాస్కుల‌ను శుభ్ర‌ప‌రిచే మెడిక‌ల్ డివైస్‌.. ఢిల్లీ ఐఐటీ బృందం ఆవిష్క‌ర‌ణ‌..

-

కరోనా రాకుండా ఉండేందుకు గాను ప్ర‌స్తుతం చాలా మంది ప‌లు ర‌కాల భిన్న‌మైన మాస్కుల‌ను ధ‌రిస్తున్నారు. వాటిల్లో ఎన్‌-95 మాస్కు కూడా ఒక‌టి. ఈ మాస్కుల‌ను వైద్యులు, సిబ్బంది, ఇత‌ర అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను అందించే వారు ఎక్కువ‌గా ధ‌రిస్తున్నారు. అయితే ఈ మాస్కుల‌ను సాధార‌ణంగా ఒక్క‌సారి వాడాక వాటిని మ‌ళ్లీ ఉప‌యోగించేందుకు వీలుండ‌దు. కానీ ఢిల్లీ ఐఐటీ త‌యారు చేసిన ఓ కొత్త ప‌రిక‌రం వ‌ల్ల స‌ద‌రు ఎన్‌-95 మాస్కుల‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ 10 సార్ల వ‌ర‌కు ఉప‌యోగించ‌వచ్చు.

వాడిన ఎన్‌-95 మాస్కుల‌ను శుభ్ర‌ప‌రిచే ఓ నూత‌న మెడిక‌ల్ డివైస్‌ను ఢిల్లీ ఐఐటీ బృందం త‌యారు చేసింది. ఈ డివైస్‌ను Chakr DeCoV అని పిలుస్తున్నారు. ఇది వాడిన ఎన్‌-95 మాస్కుల‌ను డీకంటామినేట్ చేస్తుంది. దీంతో ఆ మాస్కుల‌ను మ‌ళ్లీ 10 సార్ల వ‌రకు ఉప‌యోగించ‌వ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల బ‌యో మెడిక‌ల్ వ్య‌ర్థాల ఉత్ప‌త్తిని త‌గ్గించ‌వ‌చ్చు. ఈ డివైస్‌ను ఢిల్లీ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అశ్విని కుమార్ చౌబే వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఆవిష్క‌రించారు.

ఢిల్లీ ఐఐటీకి చెందిన చ‌క్ర ఇన్నొవేష‌న్ అనే స్టార్ట‌ప్ ఈ డివైస్‌ను త‌యారు చేసింది. దీనికి ఇండియ‌న్ మెడిక‌ల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీ (ఐసీఎంఆర్‌-ఎన్ఐవీ)ల గుర్తింపు కూడా ల‌భించింది. ఎన్‌-95 మాస్కుల‌పై, లోప‌ల ఉండే బాక్టీరియా, వైర‌స్‌ల‌ను 99.99 శాతం వ‌ర‌కు ఈ డివైస్ నాశ‌నం చేస్తుంది. అందువ‌ల్ల ఆ మాస్కుల‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ ఉప‌యోగించ‌వ‌చ్చు. అయితే మాస్కుల‌ను ఈ డివైస్ ద్వారా శుభ్ర‌ప‌రిచేందుకు 90 నిమిషాలు ప‌డుతుంది.

ఈ డివైస్‌లో వైర‌స్‌లు, బాక్టీరియాల‌ను నాశ‌నం చేసేందుకు శ‌క్తివంత‌మైన ఆక్సిడైజింగ్ ఏజెంట్ల‌ను వాడుతారు. దీంతో సూక్ష్మ‌క్రిములు దాదాపుగా పూర్తిగా న‌శిస్తాయి. కోవిడ్ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం బ‌యో మెడిక‌ల్ వ్య‌ర్థాలు పెద్ద ఎత్తున ఉత్ప‌న్నం అవుతున్నాయ‌ని, వాటిని కొంత మేర త‌గ్గించాల‌న్న ఉద్దేశంతోనే.. ఎన్‌-95 మాస్కుల‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ వాడుకునేలా ఈ ప‌రిక‌రాన్ని రూపొందించామ‌ని.. స్టార్ట‌ప్ విద్యార్థులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version