సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం ఘటనపై కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. ముందుగా ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించిన ఆయన ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు.
డీజేలపై నిషేధం విధించిన పోలీసులు, దేవాలయాల పరిరక్షణపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దుర్గ నవరాత్రుల సందర్భంగా పలు చోట్ల అమ్మవారి విగ్రహాలు ధ్వంసానికి గురయ్యాయని గుర్తుచేశారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో దుర్గామాత ఆలయంలో దొంగతనం కోసం రాలేదని, విగ్రహాన్ని ధ్వంసం కోసమే వచ్చి ఉంటారన్నారు. రాష్ట్రంలోని ఆలయాల వద్ద పోలీసులను కాపాలగా ఉంచాలన్నారు. కాగా, రాత్రి విగ్రహాన్ని పగలగొడుతున్న శబ్దాలు రావడంతో స్థానికులు ఒక దుండగుడిని పట్టుకోగా..మరో వ్యక్తి పారిపోయినట్లు తెలుస్తోంది.