అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం మరింతగా బలపడింది. ఇది సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనంతో కలిసి ఉంది. గురువారం వాయుగుండంగా మారి, వెంటనే మరింతగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశావైపు ప్రయాణిస్తుందని తెలిపారు. గురు, శుక్రవారాల్లో కళింగపట్నం, పూరి మధ్య తీరం దాటొచ్చని వివరించారు. ఈ ప్రభావంతో గురువారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల, ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని, తీరం వెంకట 55కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్నిచోట్ల ఉరుములతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు.