జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం జగనన్న సురక్ష. అయితే.. ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ పథకం కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావును ఖంగితినేలా చేసింది ఓ మహిళ.. శ్రీకాకుళం నియోజకవర్గం ఎల్‌బీఎస్ కాలనీలో జగనన్న సురక్ష కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గూనపాలెంకు చెందిన వై.ఆదిలక్ష్మికి ధృవపత్రాన్ని మంత్రి ధర్మాన ప్రసాదరావు అందజేశారు. ఈ సందర్భంగా ఏ పార్టీకి ఓటేస్తావు..మన పార్టీ ఏమిటి అని మంత్రి ధర్మాన ప్రసాదరావు సదరు మహిళ ఆదిలక్ష్మిని అడిగారు. దీంతో ఆ మహిళ టక్కున సైకిల్‌కు వేస్తా..మన గుర్తు సైకిల్ అని తెలిపింది. ఆ మహిళ సమాధానంతో మంత్రి ధర్మానతోపాటు వేదికపై ఉన్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ మహిళ తర్వాత నాలుక్కరచుకుని ఫ్యాన్ అని చెప్పింది.
అయితే ఓటు ఎవరికైనా వేసుకోవచ్చు. కానీ గోతిలో పడిపోతారు జాగ్రత్త అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు. మరో 8 నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయని వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు చంద్రబాబు నాయుడు అమలుకు నోచుకోలేని దొంగ హామీలు ఇస్తారని ఆరోపించారు. ఆ మాయలో పడొద్దన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వయసులో చిన్నవాడైనా అద్భుతమైన పాలన అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. అద్భుతమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలపై ఉందని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు
స్పష్టం చేశారు.