మీరు మధుమేహం (డయాబెటిస్) కోసం మందులు తీసుకుంటున్నారా? షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకోవడం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. అయితే ఈ మందులు మీ జీవితాన్ని మెరుగుపరుస్తున్నప్పటికీ వాటి వలన కలిగే కొన్ని అనారోగ్య ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) గురించి మీకు పూర్తిగా తెలుసా? చాలా మందికి తెలిసిన సాధారణ ప్రభావాలే కాకుండా కొందరికి మాత్రమే కనిపించే లేదా అంతగా పట్టించుకోని ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఈ వివరాలు తెలుసుకోవడం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ముఖ్యం. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
మధుమేహం చికిత్సలో ఉపయోగించే మెట్ఫార్మిన్ వంటి మందులు సాధారణంగా సురక్షితమైనవిగా పరిగణించబడినప్పటికీ, కొందరిలో ఇవి విటమిన్ B12 లోపంకి దారితీయవచ్చు. ఈ లోపం వల్ల నరాల బలహీనత (న్యూరోపతి) అలసట, జ్ఞాపకశక్తి సమస్యలు వంటివి ఏర్పడవచ్చు. చాలా మంది దీన్ని కేవలం వయసు పెరగడం లేదా “షుగర్ లక్షణం” అని పొరపాటు పడుతుంటారు.

ఇక ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచే సల్ఫోనైలూరియాస్ వంటి మందులు తక్కువ రక్త చక్కెర కు దారితీస్తాయని అందరికీ తెలుసు. కానీ, వీటి దీర్ఘకాలిక వాడకం కొందరిలో బరువు పెరగడానికి కారణం కావచ్చు. ఇది మధుమేహాన్ని మరింత నిర్వహించడం కష్టతరం చేయవచ్చు. అలాగే డయాబెటిస్‌లో కొత్తగా వాడుకలోకి వస్తున్న ఇన్హిబిటర్స్ వంటి మందులు గుండె, కిడ్నీలకు మేలు చేసినప్పటికీ, అరుదుగా కొందరిలో ఫౌర్నియర్స్ గ్యాంగ్రీన్ వంటి తీవ్రమైన జననేంద్రియ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతాయి. ఇది చాలా అరుదుగా జరిగినా ఈ లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
అంతేకాకుండా మందులు తీసుకునేటప్పుడు జీర్ణకోశ సమస్యలు అంటే విరేచనాలు కడుపు నొప్పి సర్వసాధారణం. అయితే వీటిని తేలికగా తీసుకోకుండా అవి మీ శరీరంపై ఎలా ప్రభావం చూపుతున్నాయో ఎప్పటికప్పుడు గమనించుకోవాలి.
మందులు మీ చికిత్సలో ముఖ్యమైన భాగం. వాటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోవడం అనేది భయపడటం కోసం కాదు, ముందస్తు జాగ్రత్తగా ఉండటం కోసం. మీకు ఏవైనా కొత్త లక్షణాలు లేదా అసాధారణ మార్పులు కనిపిస్తే వెంటనే మీ వైద్యుడిని (డాక్టర్‌ను) సంప్రదించండి.