డైలాగ్ ఆఫ్ ద డే : మ‌ళ్లీ వ‌చ్చాడ్రా పీకే ! తియ్యండ్రా బండ్లు !

-

తియ్యండ్రా బండ్లు

 
తిప్పండ్రా మీసం
ఇదీ ఇప్పుడు తెలంగాణ వాకిట వినిపిస్తున్న మాట. ఆ బీహారీ వ‌చ్చిండు క‌దా! ఇక తిరుగే ఉండదు ఎదురే ఉండ‌దు అన్న‌ది కేసీఆర్ న‌మ్మ‌కం.ఇదే స‌మ‌యాన జ‌గ‌న్ న‌మ్మ‌కం కూడా! ఆ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల పెద్ద‌లు పూర్తి నిస్స‌హాయ స్థితిలో ఓ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌పై ఆధార‌ప‌డ‌డ‌మే ఇప్ప‌టి వింత.ఇదే ఇవాళ్టి డైలాగ్ ఆఫ్ ద డే.

జ‌గ‌న్ కానీ కేసీఆర్ కానీ ఈ విధంగా వ్యూహ‌క‌ర్త‌ల‌పై ఆధార‌ప‌డాల్సిన ప‌నే లేదు. ప్రశాంత్ కిశోర్ లాంటి వ్యూహ‌క‌ర్త‌ల క‌న్నా మిన్న‌గానే కేసీఆర్ గ‌తంలో రాజ‌కీయాలు న‌డిపిన గొప్ప నాయ‌కుడు. తెలంగాణ రాష్ట్ర స‌మితికి జవం జీవం ఇచ్చిన నాయ‌కుడు. క‌నుక వీళ్లంతా అన‌వ‌స‌రంగా పీకేను న‌మ్ముకుంటున్నారు….అన్న‌ది ఓ వాద‌న.

తెలుగు రాష్ట్ర రాజ‌కీయాల్లో ప్ర‌శాంత్ కిశోర్ అనే పేరు పెద్ద క‌ల‌వ‌రం సృష్టిస్తోంది.గ‌తం క‌న్నా ఈ సారి ఈయ‌న పేరు ఎక్కువ‌గానే వినిపించేందుకు అవ‌కాశం కానీ ఆస్కారం కానీ ఉన్నాయి.చంద్ర‌బాబు ద‌గ్గ‌ర కూడా పీకే మాట వినిపిస్తోంది.ఇప్ప‌టికే ఆయ‌న ద‌గ్గ‌ర ప‌నిచేసిన సునీల్ ( పీకే న‌డిపే ఐ ప్యాక్ బృంద స‌భ్యుడు) చంద్ర‌బాబు ద‌గ్గ‌ర ఉన్నారు.మూడు నెలల కాంట్రాక్టు నిమిత్తం ప‌నిచేయ నున్నారు.ఆయ‌నే లోకేశ్ నిర్వ‌హించ‌బోయే పాద‌యాత్ర‌కు సైతం రోడ్ మ్యాప్ సిద్ధం చేయ‌నున్నార‌ని కూడా తెలుస్తోంది.

ఇక గ‌త ఎన్నిక‌ల్లో పెద్ద పెట్టున హ‌డావుడి చేసిన పీకే ను మ‌ళ్లీ జ‌గ‌న్ చేరువ చేసే అవ‌కాశాలున్నాయి.ఇప్ప‌టికే కొన్ని నివేదిక‌లు జ‌గ‌న్ కు అందించారు.వీటి ప్రకారం మంత్రుల ప‌నితీరుపై కూడా ఆయ‌న న‌మ్మ‌కం పుట్టించే తీరులోనే కొన్ని నిజాలు జ‌గ‌న్ కు చెప్పార‌ని తెలుస్తోంది.అదేవిధంగా సిట్టింగుల‌ను  సైతం త‌ప్పించాల‌ని పీకే టీం ప‌ట్టుబ‌డుతోంది.వీలున్నంత వ‌ర‌కూ కొన్ని కొత్త ముఖాలు వ‌స్తే క్షేత్ర స్థాయిలో వైసీపీ ఇమేజ్ పెరుగుతుంద‌ని కూడా జ‌గ‌న్ కు చెప్పి చూసిందని స‌మాచారం.సిట్టింగుల స్థానంలో కొత్త ముఖాలు వ‌స్తే జ‌నంలో జ‌గ‌న్ ఇమేజ్ పెర‌గ‌డం ఖాయ‌మ‌ని కూడా విశ్లేషిస్తోంది.

 

ఇక కేసీఆర్ ద‌గ్గ‌ర కూడా పీకే ఎంతో క్లోజ్ గా ఉన్నారు.వీరిద్ద‌రి బంధానికి స‌మ‌న్వ‌యక‌ర్త‌గా ప్ర‌కాశ్ రాజ్ ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వ్యూహ‌క‌ర్త‌గా పీకే ఉంటారు. వాస్త‌వానికి రాజ‌కీయాల్లో కేసీఆర్ కు ఉన్న ఇమేజ్ కు పీకే అవ‌స‌రం లేదు.ఎందుకంటే ఎన్నో క‌ష్టాలు దాటి పార్టీని నిల‌బెట్టిన దాఖ‌లాలు కేసీఆర్ కే సొంతం.క‌నుక జాతీయ రాజ‌కీయాల్లో తాను రాణించాలి అని అనుకుంటున్నారు క‌నుక  తెర‌పైకి పీకేను తెచ్చారని,ఆయ‌న ద్వారా తెలంగాణ మోడ‌ల్ ను రూపొందింప‌జేసి దేశ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్నారు.అటు జ‌గ‌న్ ఇటు కేసీఆర్ కాకుండా ఐ ప్యాక్ లో కొంద‌రు వివిధ పార్టీల‌కు సేవ‌లు అందిస్తూ కార్పొరేట్ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేస్తున్నారు. ఆ విధంగా పీకే స‌ల‌హాలు మ‌రియు సంప్ర‌తింపుల్లో భాగంగానే ష‌ర్మిల పాద‌యాత్ర‌కు సిద్ధం అయ్యార‌ని కూడా తెలుస్తోంది. గ‌తంలో నితీశ్ కు కూడా పీకేనే స‌ల‌హాదారు. మ‌మ‌త‌కు కూడా మొన్న‌టి వేళ సాయం చేశారు.అదే స్ఫూర్తితోనో అంతే వేగంతోనో ప‌నిచేసి పేరు తెచ్చుకోవాల‌ని పీకే ఆశ ప‌డుతున్నారు.

– డైలాగ్ ఆఫ్ ద డే మ‌న లోకం ప్ర‌త్యేకం

Read more RELATED
Recommended to you

Exit mobile version