డైలాగ్ ఆఫ్ ద డే : గ‌ణ‌తంత్ర‌మా గ‌మ్మునుండ‌వో !

-

ఏమీ మాట్లాడ‌కుండా ఉండ‌డం గ‌మ్మునుండ‌డం..గార‌డి చేయ‌డం గ‌డ‌బిడ చేయ‌డం అన్న‌వి పాల‌కుల‌కు అల‌వాటులో ఉన్న ప‌దాలు క‌నుక వాటిపై మ‌న‌కు మాట్లాడే హక్కే లేదు.దేశాన్నిపీడించే శ‌క్తుల‌కు విన్న‌పం ఒక‌టి చేస్తున్నాను. మీరు మారి ఈ దేశాన్ని మార్చ‌డం అన్న‌వి మొద‌లుపెట్టండి. ఇవి శ్ర‌ద్ధ‌గా చేయాల్సిన ప‌నులు.ప్రార్థ‌న‌తో మొద‌లిడి జాతీయ గీతం ఆలాప‌న వ‌ర‌కూ ఎవ‌రు పాడితే బాగుంటుంది..ఏ స్వ‌రం అయితే గొప్ప‌గా ఆలాప‌న చేస్తుంది అన్న సందేహాల‌తో కొట్టుమిట్టాడే దుష్ట రాజ‌కీయం ఉన్న వ‌ర‌కూ, ఉన్నంత వ‌ర‌కూ కూడా ద‌రిద్ర‌గొట్టు స‌మాజం నుంచి మ‌నం ఏ రూపంలోనూ మార్పును ఆశించ‌డం క‌ష్టం. క‌నుక మ‌నం భార‌తీయులం మ‌నం గొప్ప‌వారం మ‌నం భార‌తీయులం మ‌నం అత్యంత శ‌క్తిమంతులం అని చెప్పుకోవ‌డం ఒక్కటే మిగిలిన విధి. మితిమీరిన విశ్వాసం కూడా ఇదొక్క‌టే.. మ‌న‌సుల్లో కొన్నింటికి మాత్రం చోటిచ్చి కొన్నింటిని వ‌ద్ద‌నుకుని ప్ర‌యాణిస్తే భార‌తీయులు అన్న ప‌దానికి విస్తృతం అయిన అర్థం ఒక‌టి విన‌గ వ‌స్తుంది.అప్పుడు రాజ్యాంగ ప్ర‌సాదిత హ‌క్కుల ప్ర‌సారం సంభవిస్తుంది. వాటికో విలువ..మ‌న జీవితాల‌కూ ఓ విలువ.

ఉమ్మి ఎలా ఊయాలి..ఆర్టీసీ బ‌స్సులో ఎలా కూర్చోవాలి ఎలా తోటి వారితో న‌డుచుకోవాలి. ఇవి చాలా చిన్న విష‌యాలు కానీ మ‌న‌కు అవి ప‌ట్ట‌వు క‌నుక అవి పెద్ద పెద్ద హోదాల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌లు మాదిరిగానే చూస్తాం. రోడ్డు శుభ్రం ఇంటి శుభ్రం అన్న‌వి మ‌నం ప‌ట్టించుకోం.మ‌నుషుల్లో ఉన్న మురికిత‌నం కార‌ణంగానే చాలా మంచి మ‌రుగున ప‌డిపోతోంది. సామాజిక బాధ్య‌త అన్న‌ది లేకుండా రోడ్డెక్కే మ‌నుషుల‌ను చూసి అస‌హ్యంగా అనిపిస్తోంది. కానీ మ‌నుషులు క‌దా ఆ పాటి మురికిని క‌డుక్కోలేక‌పోవ‌డం కూడా ఓ విధ‌మ‌యిన నిర్లిప్త‌తే అని న‌వ్వుకోవాలి.

మ‌హోన్న‌త శిఖ‌రం నుంచి దేశాన్ని చూడండి..శ్ర‌మ వేదం వినిపించిన చోటు నుంచి దేశాన్ని ప్రేమించండి..అవునో కాదో కానీ మ‌నుషుల‌కు సంస్కృతి నుంచి సంప‌న్న‌త వ‌ర‌కూ దేనిని ఎలా చూడాలో చేత‌గావ‌డం లేదు.దేశాన్ని పాలించే శ‌క్తులు ఇంకా వందేమాత‌రం ఎవ‌రితో పాడిస్తే బాగుంటుంది అన్న కుటిల నీతి మాత్రం అమ‌లు చేస్తున్నారు.కుటిలం కుతంత్రం అన్న‌వి దేశాన అమ‌లు అయిన చోట నుంచి మ‌నుషులు మ‌రింత చిన్న‌గా మారిపోతున్నారు. ఈ మ‌రుగుజ్జుత‌నం బుర్ర‌లేని త‌రం కార‌ణంగానే దేశం వెనుక‌బాటు లో ఉంది.

దేశాన్ని ఎలా ప్రేమించాలి అన్న ప్ర‌శ్న ద‌గ్గ‌ర నుంచి మ‌నుషులకు సందేహాలన్న‌వి ఆరంభం కావాలి.దేశాన్ని ఎలా కాపాడుకోవాలి అన్న ప్ర‌శ్న నుంచి మ‌నుషుల‌కు కొత్త శ‌కం ఆరంభం కావాలి. దేశం అంటే మ‌ట్టి కాదు అని చిన్న నిర్వ‌చ‌నం నేను ఇవ్వ‌ను. ఆ ప‌ని గుర‌జాడ చేశాడు క‌నుక నేను చేయ‌ను. దేశం అంటే మ‌నుషులు అని అరిచి గీ పెట్టి చెప్ప‌ను.. ఆ ప‌ని కూడా మా విజ‌య‌న‌గ‌రం క‌వి అయిన గుర‌జాడ చేశాడు..ఒక‌రు చేసిన ప‌ని కార‌ణంగా ఆ ప‌నికి ఉత్ప‌త్తికి మ‌ధ్య ఉన్న భేదం అన్న‌ది సుస్ప‌ష్టం అయ్యాక నిశ్శ‌బ్దావ‌ర‌ణ‌లో ఉండిపోవ‌డ‌మే మేలు. క‌నుక దేశాన్ని నిశ్శ‌బ్ద ఆవ‌ర‌ణ నుంచి నిర్మించ‌డం మొద‌లు పెట్టండి.శాస్త్ర సాంకేతిక రంగాల‌లో పురోగ‌తి అన్న‌ది క‌న్నామ‌నిషి మ‌నిషిగా మెలిగే క్ర‌మాన్ని వెలిగే క్ర‌మాన్ని ఎవ్వ‌ర‌యినా ప్రేమిస్తున్నారా అన్న‌ది వెత‌కండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version