నితీశ్‌ కుమార్‌పై బీజేపీ కుట్ర చేసిందా..?

-

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్‌. ఎవరు రాజో..ఎవరు మంత్రో తెలిసిపోయింది. ఆర్జేడీ సింగిల్ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించింది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ బాగా పుంజుకుంది. కాంగ్రెస్‌ పరిస్థితి ఏం మారలేదు. 2015 ఎన్నికల కంటే 8 స్థానాలు తక్కువే వచ్చాయి. ఇప్పుడు అందరి కళ్లు జేడీయూపైనే. నితీశ్‌ కుమార్‌కు 40 ఏళ్ల సుధీర్ఘ అనుభవం, క్లీన్ ఇమేజ్ ఉన్నప్పటికీ…. జేడీయూ సీట్ల సంఖ్య తగ్గింది. 112 స్థానాల్లో పోటీ చేస్తే… 43 చోట్ల గెలిచింది. కొన్ని స్థానాల్లో కొద్ది మెజార్టీతో గట్టెక్కింది. జేడీయూకి ఎందుకీ పరిస్థతి వచ్చింది..? ప్రభుత్వ వ్యతిరేకతే కారణమా..? బీజేపీ కుట్ర చేసిందా..?


బీహార్‌లో మొన్నటి వరకు జేడీయూ, ఆర్జేడీ మధ్యే ఫైట్‌ ఉన్నట్లు కన్పించింది. ఎన్నికల ప్రచారంలోనూ నితీశ్ కుమార్‌నే టార్గెట్ చేశారు తేజస్వి యాదవ్‌. 2015 ఎన్నికల్లో మోడీ చేసిన ఆరోపణలను సంధిస్తు ఎటాక్ చేశారు. ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ నడుస్తుందని అంతా అనుకున్నారు. తీరా ఫలితాలు చూస్తే… సీన్ రివర్స్ అయ్యింది. బీజేపీ, ఆర్జేడీ మధ్య నువ్వానేనా అన్నంత రేంజ్‌లో పోటీ కన్పించింది. ఆర్జేడీ 75 స్థానాల్లో విజయం సాధిస్తే, బీజేపీ 74 సీట్లు గెలుచుకుంది. ఒకానొక దశలో జేడీయూ పోటీలో ఉందా అన్న డౌట్‌ వచ్చింది. 2015 ఎన్నికల్లో 71 చోట్ల గెలిచిన జేడీయూ… ఈసారి 43 స్థానాలకు పరిమితమైంది. 112 స్థానాల్లో పోటీ చేస్తే కనీసం సగం సీట్లు కూడా గెలుచుకోలేకపోయింది. బీజేపీతో పోలిస్తే.. ఓటు షేరింగ్ కూడా తగ్గింది.

నితీశ్‌ పార్టీ సీట్ల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం…బీజేపీ అంటున్నారు జేడీయూ బహిష్కృత నేతలు. కమలం పార్టీ పక్కా ప్లాన్ చేసి దెబ్బకొట్టిందని ఆరోపిస్తున్నారు. నితీశ్ కుమార్‌ మాజీ సలహాదారు పవన్‌ వర్మ ఈ కామెంట్లు చేశారు. నితీశ్‌ను బీహార్‌కే పరిమితం చేయాలన్న టార్గెట్‌తో… బీజేపీ కుట్ర చేసిందని ఆయన ఆరోపణ. అందుకే బీజేపీ పెద్దలు ఎల్‌జేపీతో ఒంటరిగా పోటీ చేయించారని చెబుతున్నారు. పవన్ వర్మ ఆరోపణల్లో నిజం లేకపోలేదు. ఎల్‌జేపీ 135 స్థానాల్లో పోటీ చేసింది. అది కూడా జేడీయూ పోటీ చేసిన చోటే అభ్యర్థులను నిలబెట్టింది. పొత్తులో భాగంగా… బీజేపీ అభ్యర్థులకు టికెట్‌ దక్కని చోటే… చిరాగ్ పాశ్వాన్‌…తన అభ్యర్ధులను నిలబెట్టారు.

ఎల్‌జేపీ… తాను మునుగుతూ… జేడీయూను కూడా ముంచేసింది. జేడీయూ కొన్ని చోట్ల… మార్జిన్‌ ఓట్లతో ఓడిపోయింది. 30కి పైగా స్థానాల్లో… లోక్‌జనశక్తికి 20 వేల నుంచి 50వేల ఓట్లు వచ్చాయి. 89 చోట్ల 10వేలకు పైగా ఓట్లు సాధించింది. ఇవన్నీ జేడీయూ ప్రాబల్యం ఉన్నవే. LJP జేడీయూ ఓట్లు చీల్చిందనడానికి డినరా నియోజకవర్గమే ఉదాహరణ. ఇక్కడ ఆర్జేడీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థికి 59 వేల 541 ఓట్లు వచ్చాయి. సీట్ల సర్దుబాటులో ఈ నియోజకవర్గం జేడీయూకి వెళ్లింది. దాంతో బీజేపీ రెబల్ అభ్యర్థికి ఎల్‌జేపీ టికెట్ ఇచ్చింది. అతడికి 50 వేల ఓట్లు వచ్చాయి. ఇలాంటి స్థానాలు చాలానే ఉన్నాయ్‌. నోఖా, మహారాజ్‌గంజ్‌, రఘునాథ్‌పూర్‌, ససరామ్‌, గైఘాట్‌లో జేడీయూ ఓట్లను చిల్చీ చావుదెబ్బ తీసింది లోక్‌జనశక్తి పార్టీ.

ఇక జేడీయూకి సీట్లు తగ్గడానికి మరో కారణం. ఓటు బదిలీ. చిరాగ్ పాశ్వాన్ కారణంగా చాలా చోట్ల… జేడీయూ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయి. కానీ బీజేపీ ఓట్లు జేడీయూకు బదిలీ కాలేదు. ఈ కారణంగానే జేడీయూ సీట్లు తగ్గితే…బీజేపీ స్థానాల సంఖ్య పెరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version