చంద్రబాబును ఆకాశానికి ఎత్తేయాలి.. అంతే..! విషయం ఏదైనా కావొచ్చు.. ఎవరు ఏమైనా అనుకోవచ్చు.. వ్యవస్థలు ఏమైనా కావొచ్చు- ఇదీ ఓ వర్గం చంద్రబాబు అనుకూల మీడియా ధోరణి. ఈ క్రమంలో కొన్ని కొన్ని సార్లు.. ఈ మీడియా అతిగా కూడా దూకుడు ప్రదర్శిస్తోంది. అంటే.. కేవలం చంద్రబాబు కృషి తప్ప. మరెవరి సహకారం లేదని, ఆయన విజనే అన్నీ అయి నడిపిస్తోందని సదరు మీడియా ప్రచారం చేస్తోంది. నిజానికి చంద్రబాబు పాలనా కాలంలోనూ ఇలానే మీడియా అన్నీ సానుకూలమే అంటూ డప్పు కొట్టింది.
దీంతో చంద్రబాబు ఫిదా అయ్యారు. అంతా బాగానే ఉంది.. ఇక, రెండో సారి.. మూడోస్సారీ గెలుపు మనదే అన్నట్టుగా వ్యవహరించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఆకళింపు చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో సదరు మీడియానే చంద్రబాబు పెద్దగా మైనస్ అయిపోయింది. ఇక, ఇప్పుడు కూడా ఈ మీడియానే మరోసారి చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేసింది. దీంతో ఈ ప్రయత్నం వికటిస్తోందని అంటున్నారు పార్టీ నేతలు. నిజానికి ఈ ప్రచారంలో ఎక్కడా చంద్రబాబుకు నెగిటివ్ ఉండదు.
మొత్తం అంతా కూడా చంద్రబాబుకు చాలా పాజిటివ్‌గా ఉంటుంది. కానీ, ఫలితం మాత్రం చాలా చాలా నెగిటివ్‌గా వస్తుండడమే ఇక్కడ చిత్రమైన విషయం. తాజాగా చంద్రబాబు పార్లమెంటరీ పార్టీ జిల్లా కమిటీలను ఏర్పాటు చేశారు. అదే సమయంలో ఇటీవల పార్టీ జిల్లా కమిటీలను, పొలిట్ బ్యోరోను, క్రమశిక్షణ సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీల్లో తాను కోరుకున్నవారికి, తన విధేయులకు పదవులు ఇచ్చారు. అదేసమయంలో ఎన్నో ఏళ్లుగా పార్టీని అంటి పెట్టుకుని ఉన్నవారికి పదవులు దక్కలేదు.
ఈ విషయం ఇప్పటికే పార్టీలో తీవ్ర ఆగ్రహ జ్వాలలకు అవకాశం ఇచ్చింది. చంద్రబాబు ఏ సమీకరణల ఆధారంగా పదవులు ఇచ్చారనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే, బాబుకు అనుకూలంగా ఉన్న ఓ పత్రిక.. `విధేయతకు వీరతాళ్లు`, `నమ్ముకున్నవారికి పదవులు`, `కష్టపడిన వారికి గుర్తింపు`, `బాబు వ్యూహంతో పదవులు` ఇలా చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తూ.. జిల్లాల్లోను, నియోజకవర్గాల్లోనూ వరుసగా కథనాలు వండివార్చుతోంది.
వీటిని చదువుతున్న నాయకులు.. తమకు ఎందుకు పదవులు రాలేదో .. అనే కోణం కన్నా.. కూడా అయితే, ఇన్నాళ్లు మేం విధేయులుగా లేమా? పార్టీ కోసం కష్టపడలేదా? బాబును నమ్ముకుని.. ఆస్తులు అమ్ముకుని.. ఎన్నికల్లో ఖర్చు చేయలేదా? అని ప్రశ్నలు సంధిస్తున్నారు. మొత్తానికి ఈ విషయం సైలెంట్‌గా ఉన్నా.. త్వరలోనే బయట పడుతుందని అంటున్నారు. ఏదేమైనా బాబుకు అనుకూలంగా వార్తలు వండి వార్చామని అనుకున్నా.. ఇది వికటించిన విషయం మాత్రం నిజం అంటున్నారు సీనియర్లు.
-vuyyuru subhash